మెడలో రుద్రాక్ష మాలతో కనిపిస్తారు.. కానీ మాలధారులు కాదు..
కాషాయ ధోతీ, కుర్తాతో మగవారు ఉంటారు.. కానీ పూజారులు కాదు..
సల్వార్ కుర్తాతో మహిళలు దర్శనమిస్తారు… కానీ భక్తులు కాదు..
నుదుటన నామాలతో కనిపిస్తారు.. కానీ ఆలయ నిర్వాహకులు కాదు..
అచ్చంగా చెప్పాలంటే వీరంతా డ్రెస్ కోడ్ మార్చుకున్న పోలీసులు.
ఉత్తరప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాశీ(వారణాసి) ఆలయంలో విధులు(Duties) నిర్వర్తించే పోలీసులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం కొత్త డ్రెస్ కోడ్(Dress Code) తీసుకువచ్చింది. సంప్రదాయ దుస్తులైన ఖాకీకి బదులు పూర్తి కాషాయంతో కూడిన వస్త్రధారణను అమలు చేస్తున్నది. ఇందుకు సంబంధించి వారణాసి పోలీస్ కమిషనర్ మోహిత్ అగర్వాల్ ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి భక్తిపారవశ్యంతో ఉండేలా డ్రెస్ కోడ్ ను రూపొందించారు. ప్రస్తుతం అక్కడ డ్యూటీలో ఉన్న పోలీసుల్ని చూస్తే ఎవరూ గుర్తు పట్టలేని విధంగా వారి వస్త్రధారణ ఉంది. పురుషులు ధోతి, కుర్తాతో.. మహిళా పోలీసులు సల్వార్ కుర్తాతో కనిపిస్తున్నారు. పవిత్ర ఆలయ సన్నిధిలో భక్తిభావంతోనే సేవలు ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ విధానానికి శ్రీకారం చుట్టినట్లు కనపడుతున్నది.
అప్పుడే విమర్శలు…
డ్రెస్ కోడ్ ఇలా అమలైందో లేదో అప్పుడే విమర్శలు మొదలయ్యాయి. ‘పోలీసులు పూజారుల తరహాలో డ్రెస్ కోడ్ ధరించవచ్చని ఏ పోలీస్ మాన్యువల్(Police Manual) చెబుతున్నది.. ఇలాంటి ఉత్తర్వులు ఇచ్చినవారిని తక్షణం సస్పెండ్ చేయాలి.. భవిష్యత్తులో దీన్ని అవకాశంగా మార్చుకుని మోసాలకు పాల్పడితే, ప్రజలను దోపిడీ చేస్తే UP సర్కారు సమాధానం ఇవ్వగలదా..’ అంటూ సమాజ్ వాదీ పార్టీ(SP) అధినేత అఖిలేశ్ యాదవ్ విమర్శించారు. అటు సోషల్ మీడియా వేదికగా సైతం కొందరు విమర్శలు చేస్తూ పోస్టులు పెట్టారు.