ఓపెనర్ ఫిల్ సాల్ట్(Phil Salt) హాఫ్ సెంచరీతో రాణించడంతో కోల్ కతా నైట్ రైడర్స్(KKR) ఘన విజయం సాధించింది. తొలుత ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేసిన KKR.. ఆ తర్వాత బ్యాటర్ల విజృంభణతో భారీ విజయాన్ని అందుకుంది. అంతకుముందు తమ బౌలర్లు పోటీపడి వికెట్లు తీసుకోవడంతో లఖ్ నవూ సూపర్ జెయింట్స్(LSG)ని 161/7కు పరిమితం చేసింది. టార్గెట్ ను అలవోకగా దాటేసింది. 15.4 ఓవర్లలో 2 వికెట్లకు 162 రన్స్ చేసిన KKR.. 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
పస లేని లఖ్ నవూ…
మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు తీసుకోవడంతోపాటు మిగతా బౌలర్లంతా తలో వికెట్ తీసుకుంటూ పోవడంతో LSG బ్యాటర్లలో పస లేకుండా పోయింది. వికెట్లు చేజారడంతోపాటు చప్పగా సాగిన బ్యాటింగ్ తో 161 పరుగుల తక్కువ స్కోరు నమోదైంది. డికాక్(10), రాహుల్(39), దీపక్ హుడా(8), స్టాయినిస్(10), ఆయుష్ బదోని(29), నికోలస్ పూరన్(45; 32 బంతుల్లో 2×4, 4×6) స్కోర్లు చేశారు.
సాల్ట్ ఘనంగా…
వికెట్ కీపర్ ఫిల్ సాల్ట్(89 నాటౌట్; 47 బంతుల్లో 14×4, 3×6) బ్యాటింగ్ కోల్ కతాను ఘనంగా నడిపించింది. అతడు 26 బాల్స్ లోనే 8 ఫోర్లు, రెండు సిక్సర్లతో హాఫ్ సెంచరీ మార్క్ దాటాడు. ఒకవైపు రెండు వికెట్లు సునీల్ నరైన్(6), రఘువన్షీ(7) చేజారినా సాల్ట్ తగ్గలేదు. ఈ ఓపెనర్ కు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తోడు కావడంతో ఇన్నింగ్స్ చకచకా సాగింది.