తొలుత రుతురాజ్, శివమ్ దూబె బ్యాటింగ్ తో చెన్నై దూకుడు చూపిస్తే తానేం తక్కువ కాదంటూ ముంబయి దీటుగా జవాబిచ్చింది. కానీ చివరిదాకా దాన్ని కాపాడుకోలేకపోయింది. రోహిత్ శర్మే ఒంటరి పోరాటం(One Man Show) చేయాల్సి రావడం, సహకరించేవారు లేకపోవడంతో ముంబయి పోరాటం ముగిసిపోయింది. మొదట చెన్నై 4 వికెట్లకు 206 పరుగులు చేస్తే ముంబయి ఆ లక్ష్యాన్ని చేరకుండానే చేతులెత్తేసింది. 6 వికెట్లకు 186 పరుగులు చేసి 20 రన్స్ తేడాతో ఓడిపోయింది.
సీఎస్కే ఇలా…
రహానె(5), రచిన్ రవీంద్ర(21) ఔటయ్యాక శివమ్ దూబె(66; 38 బంతుల్లో 10×4, 2×6) క్రీజులోకొచ్చాడు. అప్పటికే ఊపు మీదున్న రుతురాజ్(69; 40 బంతుల్లో 5×4, 5×6) కు దూబె జత కలవడంతో వేగంగా రన్స్ వచ్చాయి. గైక్వాడ్ 33 బాల్స్ లో ఫిఫ్టీ చేస్తే, దూబె 28 బంతుల్లోనే 50 మార్క్ అందుకున్నాడు. మిచెల్(17) ఔటవగానే క్రీజులోకొస్తూనే ధోని(20; 4 బంతుల్లో 3×6) కంటిన్యూగా మూడు బంతుల్లో మూడు సిక్సర్లు బాదాడు.
ముంబయి మార్క్…
207 పరుగుల టార్గెట్ తో రంగంలోకి దిగిన ముంబయికి ఓపెనర్లు రోహిత్ శర్మ(105 నాటౌట్; 63 బంతుల్లో 11×4, 5×6), ఇషాన్ కిషన్(23) శుభారంభం అందించారు. ముఖ్యంగా రోహిత్ తన మ్యాజిక్ ను చూపిస్తూ 30 బాల్స్ లో 50 కంప్లీట్ చేశాడు. సూర్యకుమార్(0)కే వెనుదిరిగితే తిలక్ వర్మ(31; 20 బంతుల్లో 5×4)తో కలిసి రోహిత్ అదరగొట్టాడు. దీంతో ముంబయి ఇన్నింగ్స్ 9 రన్ రేట్ కు పైగా సాగింది.
కానీ ఆ తర్వాతే…
3 వికెట్లకు 130తో విజయం దిశగా సాగుతున్నట్లు కనిపించిన ముంబయి ఒక్కసారిగా కష్టాల్లో పడి 157కు చేరుకునే సరికి 6 వికెట్లు చేజార్చుకుంది. హార్దిక్(2), టిమ్ డేవిడ్(13) షెఫర్డ్(1) వెనుదిరగడంతో భారమంతా మాజీ కెప్టెన్ పైనే పడింది. ఫైనల్ ఓవర్లో 34 పరుగులు అవసరమైన పరిస్థితుల్లో తొలి రెండు బాల్స్ ఆడి ఒక పరుగు తీసిన నబీ.. రోహిత్ కు స్ట్రైక్ ఇచ్చాడు.
రెండు వరుస ఫోర్లు కొట్టినా లక్ష్యం పెద్దది కావడంతో అతడు కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. IPLలో రెండో సెంచరీని నమోదు చేసినా తన టీమ్ ను గెలిపించలేకపోయాడు రోహిత్. మతీష పతిరణ 4 ఓవర్లలో 28 పరుగులే ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు.