బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు జరిపిన ముఠాను పోలీసులు గుర్తించారు. ముంబయి బాంద్రా(Bandra)లోని గెలాక్సీ అపార్ట్ మెంట్ వద్ద నాలుగు షెల్స్ తోపాటు బుల్లెట్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. కాల్పులు జరిగిన సమయంలో సల్మాన్ అదే ఇంట్లో ఉన్నారు. అయితే ఈ ఘటనతో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కు సంబంధం ఉందని పోలీసులు భావిస్తున్నారు.
సల్మాన్ తో ఫోన్లో మాట్లాడిన ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే.. అతడి భద్రతను మరింత పెంచాలని పోలీస్ కమిషనర్ ను ఆదేశించారు. ఈ బాలీవుడ్ స్టార్ కుటుంబం నివాసముండే 8 అంతస్తులు గల గెలాక్సీ అపార్ట్మెంట్ వద్ద CC ఫుటేజ్ సహా కీలక ఆధారాల్ని పోలీసులు సేకరించారు. సెంట్రల్ ఇంటెలిజెన్స్ తోపాటు ఢిల్లీ పోలీసులు ఈ కేసుపై దృష్టిపెట్టి ఇది బిష్ణోయ్ గ్యాంగ్ పనేనన్న నిర్ధారణకు వచ్చారు.
ఇద్దరు వ్యక్తులు బైక్ ను దొంగిలించి సల్మాన్ ఇంటికి చేరుకున్నారు. ఆ మోటార్ సైకిల్ ను మౌంట్ మేరీ ఏరియాలో రికవరీ చేసుకోగా, వెనుక కూర్చున్న వ్యక్తి కాల్పులు జరిపాడు. అయితే ఈ ఇద్దరూ మహారాష్ట్రకు చెందినవారు కాదని తేల్చారు. ఈ మధ్య ఓ వ్యాపారిని హత్యచేసిన కేసులో గురుగ్రామ్ కు చెందిన విశాల్ అలియాస్ కలూ అని అనుమానిస్తున్నారు.
అయితే ఫేస్బుక్ లో వచ్చిన పోస్ట్ హాట్ గా ఉందిది. ‘మేం శాంతి కోరుకుంటున్నాం.. యుద్ధానికి వ్యతిరేకంగా ఉండాలనుకుంటున్నాం.. ఇది ట్రైలర్ మాత్రమే సల్మాన్.. మా శక్తియుక్తుల్ని గుర్తిస్తావనుకుంటున్నాం.. మమ్మల్ని పరీక్షించొద్దు.. ఇదే మొదటి, చివరి వార్నింగ్ కూడా.. హద్దు దాటితే బుల్లెట్లు వృథాగా కాల్చే పని ఉండదు.. ఇద్దరు దుర్మార్గులు దావూద్ ఇబ్రహీం, చోటా షకీల్ లో ఎవర్నీ నువ్వు దేవుడిలా విశ్వసిస్తావు.. నీతో ఎక్కువ మాట్లాడటం ఇష్టం లేదు.. జై శ్రీరామ్.. జై భారత్.. సలాం షాహిదా’ అంటూ ముగించారు.