ఇరువర్గాల భారీ ఎన్ కౌంటర్(Encounter)తో దండకారణ్యం మరోసారి ఉలిక్కిపడింది. వరుసగా చోటుచేసుకుంటున్న ఎదురుకాల్పులు అటవీప్రాంతాన్ని హోరెత్తిస్తున్నాయి. తాజాగా ఛత్తీస్ గఢ్(Chhattisgarh)లో జరిగిన మరో ఎన్ కౌంటర్లో 18 మంది మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. సంఘటనాస్థలంలో భారీగా ఆయుధాలు స్వాధీనం కాగా, ఓ అధికారితోపాటు మొత్తం ముగ్గురు పోలీసులకు గాయాలయ్యాయి.
జాయింట్ ఆపరేషన్…
హెపటోలా ఫారెస్టు ప్రాంతంలోని బైనగుండా-కోరోనర్ గ్రామాల మధ్య ఇరువర్గాలు ఎదురుపడ్డాయి. ఛోటాబేతియా పోలీస్ స్టేషన్ పరిధిలో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయని కాంకేర్ SP ఐ.కె.ఎలిసెల తెలిపారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(BSF), డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్(DRG) జాయింట్ గా కూంబింగ్ జరుపుతున్న టైమ్ లో మావోయిస్టులు ఎదురుపడ్డారు. ఏకే-సిరీస్ రైఫిల్స్ 7, లైట్ మిషిన్ గన్స్ 3ను పోలీసులు రికవరీ చేసుకున్నారు.
గత పదేళ్లలో…
2004-2014 దశాబ్దానితో పోల్చుకుంటే 2014-2023 కాలంలో వామపక్ష తీవ్రవాదం(Left-Wing Extremism) 52 శాతం, మరణాలు 69% తగ్గిపోయాయి. ఇలాంటి ఘటనలు అంతకుముందు పదేళ్ల కాలంలో 14,862 జరగ్గా, తర్వాతి పదేళ్లకు వాటి సంఖ్య 7,128 గా రికార్డయ్యాయి. 2004-2014లో 6,035 మంది ప్రాణాలు కోల్పోతే, 2014-2023 కాలంలో మరణాల సంఖ్య 1,868 చేరుకున్నట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ లెక్కలు చెబుతున్నాయి.
నక్సల్స్ దాడుల్లో భద్రతా దళాలు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు 72% తగ్గిపోగా, అంతకుముందు దశాబ్దంలో 1,750గా ఉన్న మరణాలు 485కి చేరుకున్నాయి. సాధారణ పౌరుల మృతి కేసులు భారీ(68%)గా తగ్గిపోయాయి. అంతకుముందు 4,285 మంది చనిపోతే ఈ పదేళ్లలో ఆ సంఖ్య 1,383కు చేరింది.