ప్రభుత్వానికి కళ్లు, చెవులుగా భావించే సలహాదారుల(Advisers) విషయంలో ఎన్నికల సంఘం మరోసారి క్లారిటీ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం రాష్ట్రంలో రాజకీయం రంజుగా మారిన పరిస్థితుల్లో సర్కారీ అడ్వయిజర్లపై ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతూ పొలిటికల్ లీడర్లలా వ్యవహరిస్తూ విమర్శలు, ప్రతి విమర్శలు, సవాళ్ల విసురుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎలక్షన్ కమిషన్ ఈ విషయంపై సీరియస్ అయింది.
కోడ్ పరిధిలోనే…
ప్రభుత్వం నుంచి జీతభత్యాలు తీసుకుంటున్నందున వారు కూడా ఎన్నికల కోడ్(Model Code Of Conduct) పరిధిలోనే ఉంటారని EC చెప్పింది. ఎవరైనా గీత దాటినట్లు కనిపిస్తే వేటేనని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. నిర్దేశించిన విధులకు భిన్నంగా రాష్ట్రంలో రాజకీయ జోక్యం(Political Involvement) చేసుకుంటున్నారంటూ ఆంధ్రప్రదేశ్ లోని సలహాదారులపై ECకి ఫిర్యాదులు అందాయి.
నో మీడియా…
ఆ కంప్లయింట్లపై SEC(State Election Commission) అధికారులతో విచారణ నిర్వహించిన CEC.. విపక్షాలను విమర్శిస్తూ మీడియా సమావేశాలు పెడుతున్నట్లు గుర్తించింది. అధికారులు అందజేసిన రిపోర్ట్ ను పరిశీలించి.. ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతున్న 40 మంది అడ్వయిజర్లకు ఎలక్షన్ కోడ్ వర్తిస్తుందని మరోసారి స్పష్టం చేసింది.