ముంబయిని భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నామన్న సంతోషం పంజాబ్ కు మిగలలేదు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మూడు వికెట్లతో మాయాజాలం చేసి ముంబయిని గెలిపించాడు. అయితే 7 వికెట్లు కోల్పోయిన దశలోనూ అశుతోష్ శర్మ చూపిన పట్టుదలతో గెలిచినంత పనిచేసింది పంజాబ్. కానీ చివరకు తలవంచక తప్పలేదు. తొలుత బ్యాటింగ్ కు దిగిన ముంబయి ఇండియన్స్(MI) 7 వికెట్లకు 192 స్కోరు చేసింది. పెద్ద టార్గెట్ తో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్(PBKS) 183కే ఆలౌటై 9 రన్స్ తేడాతో ఓడిపోయింది.
6, 0, 1, 1…
ఈ నంబర్లు చూస్తే మీకేమనిపిస్తుంది. ఒక ఓవర్లో వచ్చిన పరుగులుగా అనిపిస్తుంది కదూ. కానీ ఇవి బ్యాటర్లు ఒక్కొక్కరు సాధించిన రన్స్. పంజాబ్ ప్లేయర్ల వ్యక్తిగత(Individual) పరుగులివి. ఓపెనర్లు శామ్ కరణ్(6), ప్రభ్ సిమ్రన్(0) ఇక రూసో(1), లివింగ్ స్టోన్(1), హర్ ప్రీత్ సింగ్(13), జితేష్ శర్మ(9).. ఇలా సాగింది ఆ టీమ్ ఇన్నింగ్స్. 77 రన్స్ కే 7 వికెట్లు కోల్పోయిన పంజాబ్ ను అద్భుత హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు అశుతోష్ శర్మ.
అహో అశుతోష్…
అహా.. ఇదేం బ్యాటింగ్ అన్న రీతిలో తన టాలెంట్ ను చూపించాడు అశుతోష్(61; 28 బంతుల్లో 2×4, 7×6) శర్మ. టిమ్ డేవిడ్(14) సహా కీలక బ్యాటర్లంతా పెవిలియన్ దారి పట్టినా, ఉన్నది టెయిలెండర్లయినా ఎక్కడా ఆత్మవిశ్వాసం(Self Confidence) కోల్పోలేదు. ఇతణ్ని ఔట్ చేసిన తర్వాతే తాము గెలుస్తామన్న ధీమా ముంబయికి వచ్చిందంటే ఈ ప్లేయర్ బ్యాటింగ్ ఎలా సాగిందో అర్థమవుతుంది.