అది పూనకమా… విధ్వంసమా..
బుల్లెట్ స్పీడా… రాకెట్ వేగమా…
వీటిలో ఇది మాత్రమే అని చెప్పలేని రీతిలో, వర్ణించడానికి మాటలు రాని రీతిలో సాగింది… సన్ రైజర్స్ హైదరాబాద్(SRH) బ్యాటింగ్. ఢిల్లీ క్యాపిటల్స్(DC) బౌలర్లను చితకబాదుతూ, నిశ్చేష్టుల్ని చేస్తూ సాగించిన హిట్టింగ్ తో తొలి మూడు ఓవర్లలోనే 62 పరుగులు వచ్చాయంటే ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ విధ్వంసం ఎలా సాగిందో తెలిసిపోతుంది. సరిగ్గా ఐదో ఓవర్ ముగిసే సరికి అంటే 30 బంతుల్లోనే ఆ జట్టు స్కోరు 100 దాటింది. ఢిల్లీ బౌలింగ్ ను ఊచకోత కోస్తూ, బౌలర్లను నిరాశలో ముంచేసేలా బ్యాటింగ్ చేశారీ ఓపెనర్లు. కానీ ఆ దూకుడును అడ్డుకట్ట వేశాడు కుల్దీప్ యాదవ్.
ఒకర్ని మించి ఒకరు…
హైదరాబాద్ కు మొదట్నుంచి కలిసొస్తున్నదేదైనాన ఉందంటే అది ఓపెనర్ల(Openers)నే చెప్పాలి. అంతలా దుమ్ము రేపుతున్నారు హెడ్, అభిషేక్. హెడ్ అయితే 16 బాల్స్ లోనే హాఫ్ సెంచరీ దాటాడు. అటు అభిషేక్(46; 12 బంతుల్లో 2×4, 6×6) ఏమన్నా తక్కువనా. ట్రావిస్ హెడ్ ను మించి దంచుడు మొదలుపెట్టాడు. బాల్ కింది నుంచి వస్తే ఫోర్, కాస్త ఎత్తులో వేస్తే సిక్స్ అన్న రీతిలో సాగిందా ఇద్దరి ఇన్నింగ్స్. మొన్న ముంబయితో 277, ఆ తర్వాత బెంగళూరుతో 287 స్కోర్లు చేసిన SRH.. ఇప్పుడా రికార్డులను కూడా తుడిపేస్తుందా అన్న రీతిలో సాగుతున్నది వీరబాదుడు.
కుల్దీప్ చకచకా…
అప్పటికే 11 బంతుల్లో 46 చేసిన అభిషేక్ మరో బంతిలో ఫిఫ్టీ దాటితే జైస్వాల్ రికార్డు సమమయ్యేది. కానీ అక్కడే మాయ చేసిన కుల్దీప్.. అభిషేక్ ను వెనక్కు పంపాడు. ఇక ఆ తర్వాత వచ్చిన మార్ క్రమ్(1)ను సైతం నిలదొక్కుకోకముందే పెవిలియన్ పంపాడు. ఇలా ఒకే ఓవర్లో రెండు వికెట్లు కూలడంతో ఢిల్లీ ఊపిరి పీల్చుకుంది.