టీచర్ల నియామకాలకు సంబంధించి పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి గట్టి షాక్ ఇచ్చింది.. కోల్ కతా హైకోర్టు(Kolkata High Court). 2016లో నియామకమైన 24,640 టీచర్ల రిక్రూట్ మెంట్లను రద్దు చేస్తూ కీలక ఆదేశాలిచ్చింది. పశ్చిమబెంగాల్ లో చోటుచేసుకున్న టీచర్ల కుంభకోణం(Teachers Scam)పై CBI దర్యాప్తునకు ఆదేశించింది. అప్పట్లో స్టేట్ లెవెల్ సెలక్షన్ టెస్ట్-2016(SLST) ద్వారా జరిపిన భారీ నియామకాల్లో పూర్తి అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. దీనిపై దాఖలైన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. ఇప్పుడు కీలక తీర్పును ఇచ్చింది.
అంతా రద్దు…
మొత్తం టీచింగ్, నాన్-టీచింగ్ స్టాఫ్ నియామకాల్ని(Recruitments)ను రద్దు చేస్తూ కోల్ కతా హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం(Devision Bench) నిర్ణయం తీసుకుంది. జస్టిస్ దేవాన్షు బాసక్, జస్టిస్ మహ్మద్ షబ్బీర్ రషీది నేతృత్వంలో బెంచ్ ఈ సంచలన ఉత్తర్వులు ఇచ్చింది. మమతా బెనర్జీ పరిపాలనలో అత్యంత వివాదాస్పదంగా మారిన 2016-టీచర్ల కుంభకోణంపై CBI విచారణకు ఆదేశిస్తూనే.. మూడు నెలల్లోగా రిపోర్ట్ అందజేయాలని దర్యాప్తు సంస్థకు స్పష్టం చేసింది.
ప్యానెల్ నే…
కేవలం నియామకాలే కాదు.. ఈ రిక్రూట్ మెంట్ కు కారణమైన ప్యానెల్(Panel)నే తొలగించింది కోల్ కతా హైకోర్టు. ఈ నోటిఫికేషన్ లో భాగంగా 23 లక్షల మంది పరీక్షలు రాశారు. 2016-SLSTని పూర్తి రద్దు చేసినట్లు ప్రకటించి మరోసారి నోటిఫికేషన్ ఇవ్వాలని తృణమూల్ కాంగ్రెస్(TMC) ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇప్పటికే దీనిపై వాదనలు విన్న న్యాయస్థానం.. CBI విచారణను తామే స్వయంగా పర్యవేక్షిస్తామని చెప్పింది. ఇప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థకు సైతం గడువు విధిస్తూ ఆలోపు పూర్తి నివేదిక అందజేయాలని చెప్పడం అత్యంత సంచలనంగా మారింది.
జీతాలు రిటర్న్…
హైకోర్టు తీర్పుతో ఇప్పుడు వీళ్లంతా ఉద్యోగాలు కోల్పోనుండగా, ఇప్పటివరకు తీసుకున్న జీతాన్ని 12% వడ్డీతో సహా ఆరు వారాల్లో చెల్లించాలని ఆదేశాలు ఇచ్చింది. OMR షీట్లు నింపకుండానే ఉద్యోగాలు సంపాదించినట్లు హైకోర్టు తెలిపింది. దీనిపై మమతా బెనర్జీ మండిపడుతూ న్యాయవ్యవస్థను BJP మేనేజ్ చేస్తుందంటూ కామెంట్ చేశారు. ఇదే కేసులో మంత్రి పార్థ ఛటర్జీ ఇంటిపై దాడి చేసిన ED అధికారులు అతణ్ని 2022 జులై 23న అరెస్టు చేశారు. ఈయన అరెస్టు తర్వాత మంత్రి సన్నిహితురాలు(Close Aide) అర్పితా ముఖర్జీ ఇంట్లో రూ.21 కోట్ల విలువైన నగదు, ఆభరణాలు దొరికాయి.