దేశ సర్వోన్నత న్యాయస్థానం(Supreme Court) సోమవారం సంచలన నిర్ణయం తీసుకుంది. చట్టాల కన్నా మానవత్వం, అంతకుమించి రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని కాపాడేలా తీర్పునిచ్చింది. అత్యాచారానికి గురై కడుపులో బిడ్డను మోస్తూ అవస్థలు పడుతున్న 14 ఏళ్ల బాలిక గర్భాన్ని తొలగించేందుకు(Terminate) అనుమతిచ్చింది. ప్రస్తుతం ఆ బాలిక 30 వారాల(7 నెలలు) గర్భవతి కావడంతో పూర్తిస్థాయి రిపోర్టుల్ని పరిశీలించిన అనంతరం ఈ తీర్పునిచ్చింది.
అత్యవసరంగానే…
రాజ్యాంగంలోని 142వ అధికరణం(Article) కల్పించిన హక్కుల్ని పొందే అవకాశం బాలికకు ఉన్నందున కొన్ని అత్యవసర పరిస్థితుల్లో గర్భ విచ్ఛిత్తికి ఆదేశాలు జారీ చేయాల్సి వచ్చిందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను జాగ్రత్తగా చేపట్టాలంటూ ముంబయి సియోన్(Sion)లోని లోకమాన్య తిలక్ మున్సిపల్ మెడికల్ కాలేజ్, జనరల్ హాస్పిటల్(LTMGH) డీన్ ను ఆదేశించింది. ఇందుకోసం ప్రత్యేక వైద్య బృందాన్ని(Doctors Assembler) నియమించాలని స్పష్టం చేసింది.
కంప్లీట్ రిపోర్ట్…
గర్భాన్ని తొలగించడాన్ని నిరాకరిస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీంకోర్టు కొట్టివేసింది(Quash). అంతకుముందు సియోన్ హాస్పిటల్ నుంచి పూర్తిస్థాయి రిపోర్ట్ తెప్పించుకున్న టాప్ కోర్ట్… గర్భ విచ్ఛిత్తి దృష్ట్యా జరగబోయే శారీరక, మానసిక పరిణామాల్ని సునిశితంగా పరిశీలించింది.
గర్భం తొలగింపు విషయంలో సదరు బాధిత బాలిక అంగీకారం ఉన్నా లేకున్నా డాక్టర్ల నివేదికను అనుసరించి నిరభ్యంతరంగా గర్భవిచ్ఛిత్తి(Pregnancy Termination) జరపొచ్చని తీర్పులో స్పష్టం చేసింది. నిబంధనల ప్రకారం 24 వారాలు దాటితే గర్భం తొలగించడం నేరం, కష్టసాధ్యం. కానీ ఇది అసాధారణ కేసుగా భావించిన అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పునిచ్చింది.