తెలంగాణలో ప్రజాపాలన ప్రారంభమైందని, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును తుమ్మిడిహెట్టి(Tummidihetti) వద్ద నిర్మించి దానికి అంబేడ్కర్ పేరు పెడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదిలాబాద్ సభలో పాల్గొన్న CM.. కుప్టి ప్రాజెక్టును సైతం పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ లో కొత్తగా యూనివర్సిటీని తీసుకువస్తామన్నారు.
నాగోబా జాతరకు 4 కోట్ల రూపాయలు కేటాయించాలని నిర్ణయించామన్న CM… కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని BRS, BJP చూస్తున్నాయని విమర్శించారు. ఆదిలాబాద్ లో ఆత్రం సుగుణ గెలవకపోతే ఈ పథకాలన్నీ ఆగిపోయే ప్రమాదం ఉంటుందని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును ముందునుంచీ విమర్శిస్తున్నది హస్తం పార్టీ.
తమ హయాంలో తెరపైకి తెచ్చిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును కాదని అవినీతి కోసమే కాళేశ్వరాన్ని KCR నిర్మించారని ముందునుంచీ విమర్శలు చేస్తున్నది. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మిస్తే అత్యంత తక్కువ ఖర్చుతో నిర్మాణం పూర్తయ్యేదని, ముంపు కూడా తగ్గేదన్నది కాంగ్రెస్ వాదన. దీనికి బలం చేకూరుస్తూ ఇప్పుడు రేవంత్ సైతం ఆ ప్రాజెక్టును కట్టి తీరతామని క్లారిటీ ఇచ్చారు.