వంటకు వాడే మసాలాల్లో హానికారక క్యాన్సర్(Cancer) పదార్థాలు ఉన్నాయంటూ రెండు భారతీయ మసాలా కంపెనీలను రెండు దేశాలు నిషేధించాయి. ఆ దేశాలకు చెందిన సెంటర్ ఫర్ ఫుడ్ సేఫ్టీ(CFS) ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారిక వర్గాలు అంటున్నాయి. ప్రముఖ ఇండియన్ బ్రాండ్లుగా ముద్రపడ్డ MDH, Everest మసాలాల్లో పెస్టిసైడ్స్ లక్షణాలున్నాయని గుర్తించినట్లు తెలిపాయి.
పెస్టిసైడ్ ఇదే…
MDH, Everest మసాలాల్లో ‘కార్సినోజెనిక్ పెస్టిసైడ్ ఎథిలీన్ ఆక్సైడ్’ లక్షణాలున్నట్లు హాంగ్ కాంగ్ స్పష్టం చేసింది. ఎథిలీన్ ఆక్సైడ్ అనేది క్యాన్సర్ కారక పదార్థమని, ఇది మనుషులపై తీవ్ర ప్రభావం చూపుతుందని భావించింది. పరిమితికి మించి క్యాన్సర్ కారక లక్షణాలు కనపడ్డట్లు ఈనెల 5న తన రిపోర్టులో CFS తెలిపింది.
MDH గ్రూప్ నకు సంబంధించి మద్రాస్ కర్రీ పౌడర్, సాంబార్ మసాలా పౌడర్, కర్రీ పౌడర్ పై నిషేధం విధించింది. షిమ్ సా సుయి అనే ప్రాంతంలోని రిటైర్ స్టోర్ల నుంచి వీటిని తీసుకుని పరిశీలించిన అక్కడి ఫుడ్ సేఫ్టీ అథారిటీ… వెంటనే ఆయా కంపెనీ(Vendors)లకు మెసేజ్ పంపించింది. తక్షణమే వాటి సప్లయ్ నిలిపివేయాలని స్పష్టం చేసింది. హాంగ్ కాంగ్ నిబంధనల ప్రకారం పెస్టిసైడ్ రెసిడ్యూ అనేది పెద్ద డేంజరస్ కాదని, కానీ ఎథిలీన్ ఆక్సైడ్ కలవడం వల్లే క్యాన్సర్ కారకంగా మారిపోతుందట.
నాలుగు రోజుల క్రితం(ఏప్రిల్ 18న) సింగపూర్ సైతం ఇదే విధమైన ప్రకటన ఇచ్చి ‘ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలాల్ని’ను తిప్పి పంపింది. వాడీలాల్ భాయ్ షా 57 ఏళ్ల క్రితం ప్రారంభించిన ఎవరెస్ట్ కంపెనీ.. సుగంధ ద్రవ్యాల ఉత్పత్తిలో భారత్ లోనే అతి పెద్ద కంపెనీ కాగా 80 దేశాలకు వ్యాపారాన్ని విస్తరించింది. అయితే స్పైస్ బోర్డ్ ఆఫ్ ఇండియా ప్రమాణాల మేరకే మసాలాల్ని తయారు చేస్తున్నామని కంపెనీ అంటున్నది.