ఓవర్ కు 10 రన్ రేట్ కు పైగా చేయాల్సి ఉన్నా అదరలేదు… ప్రారంభంలోనే రెండు ప్రధాన వికెట్లు కోల్పోయినా బెదరలేదు… ఏది ఏమైనా తానున్నానంటూ భరోసానిస్తూ.. చివరి వరకు క్రీజులోనే ఉంటానంటూ పట్టుదల ప్రదర్శించిన మార్కస్ స్టాయినిస్ స్టైలిష్ బ్యాటింగ్ తో లఖ్నవూ సూపర్ జెయింట్స్(LSG) అద్భుత విజయం సాధించింది. IPL కెరీర్లో తొలి శతకం నమోదు చేసిన స్టాయినిస్.. జట్టుకు తిరుగులేని విజయాన్నందించాడు. తొలుత చెన్నై సూపర్ కింగ్స్(CSK) 210/4 చేస్తే.. ఆ టార్గెట్ ను ఛేదించింది సూపర్ జెయింట్స్.
ఇన్నింగ్స్ ఇలా…
అసలే టార్గెట్ 211. హిట్టింగ్ బ్యాటర్లయిన డికాక్(0), రాహుల్(16)… ఇలా 33 స్కోరుకే రెండు వికెట్లు చేజారిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లోనే బ్యాటింగ్ కు వచ్చాడు మార్కస్. తొలుత నిదానంగా ఆడుతూ మధ్యలో బౌండరీలు బాదిన స్టాయినిస్(124 నాటౌట్; 63 బంతుల్లో 13×4, 6×6).. చివరకు సిక్సర్ల దాకా వచ్చి తొలి 100 పూర్తి చేశాడు. పడిక్కల్(15), పూరన్(34) అవుటైనా చాహర్ ను వెంటబెట్టుకుని ఇన్నింగ్స్ సాగించాడు.
ఫైనల్ ఓవర్లో…
చివరి ఓవర్లో 17 రన్స్ అవసరమైన పరిస్థితుల్లో తొలి బాల్ నే సిక్సర్ గా మలిచాడు స్టాయినిస్. ఇక రెండో బాల్ ను ఫోర్ పంపించడంతో సమీకరణం నాలుగు బంతుల్లో 7 పరుగులుగా మారింది. కానీ అనూహ్యంగా మూడో బంతిని బౌండరీకి పంపించగా అది నోబాల్ అయింది. దీంతో అలా 5 రన్స్ వచ్చాయి. ఇక మరోసారి వేసిన మూడో బంతినే ఫోర్ గా మలచడంతో 19.3 ఓవర్లలోనే 213/4 చేసిన సూపర్ జెయింట్స్ అనూహ్య విజయాన్ని దక్కించుకుంది.