ఈవీఎం-వీవీప్యాట్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. వాటిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. ఈవీఎం-వీవీప్యాట్లకు సంబంధించి రెండు కీలక సూచనలు చేసింది. సింబల్ లోడింగ్ తర్వాత SLUలు సీల్ చేసి 45 రోజులు భద్రంగా ఉంచాలని చెప్పింది. ఇంజినీర్ల టీమ్ తో EVMలు పరిశీలించే అవకాశం కల్పించాలని, రిజల్ట్స్ తర్వాత అభ్యర్థులు కోరితే వాటిని పరిశీలించే ఛాన్స్ ఇవ్వాలని ECకి స్పష్టం చేసింది. అయితే ఇందుకు అభ్యర్థుల నుంచి 7 రోజుల్లో వినతి వస్తేనే లెక్కలోకి తీసుకోవాలని ఆదేశించింది.
అసలు విషయం ఇది…
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రా(EVM)ల్లో నమోదైన ఓట్లతో 100 శాతం వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించాలన్న పిటిషన్లపై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. ఎన్నికల ప్రక్రియను నియంత్రించే అధికారం తమకు లేదని, రాజ్యాంగ సంస్థ అయిన EC పనితీరును తాము నిర్దేశించలేమని స్పష్టం చేసింది. కౌంటింగ్ టైంలో EVM ఓట్లతో వీవీప్యాట్ స్లిప్ లను క్రాస్ వెరిఫై చేయాలంటూ వేసిన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం ఏప్రిల్ 18న విచారణ జరిపింది.
క్లారిటీ కోసం…
ఈ విషయంలో తమకు సందేహాలున్నందున మరింత స్పష్టత కావాలంటూ కేంద్ర ఎన్నికల సంఘా(CEC)న్ని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ద్విసభ్య బెంచ్(Devision Bench) కొన్ని ప్రశ్నలు సంధించింది. EVMలో మైక్రో కంట్రోలర్ ఎక్కడుంటుంది.. కంట్రోలింగ్ యూనిట్లోనా లేక వీవీప్యాట్ లోనా.. మైక్రో కంట్రోలర్ అనేది ఒకసారి తయారుచేసిన ప్రోగ్రామా కాదా.. అన్నవి నిర్ధారించాలని సూచించడంతో EC అధికారులు హాజరై వివరణ ఇచ్చారు.
పిటిషనర్లపై…
EVM సోర్స్ కోడ్ అంశాన్ని గుర్తుచేసిన పిటిషనర్లు.. పారదర్శకత కోసం దాన్ని బయటపెట్టాలని కోరడంతో ధర్మాసనం వ్యతిరేకించింది. ‘సోర్స్ కోడ్ ను ఎప్పుడూ బహిర్గతం చేయకూడదు.. అలా చేస్తే దాన్ని దుర్వినియోగం చేసే ఛాన్స్ ఉంది.. మీ పిటిషనర్ల ఆలోచనా ధోరణిని మార్చలేం.. కేవలం అనుమానాలను ఆధారం చేసుకుని ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేం.. ఎన్నికల ప్రక్రియను నియంత్రించలేం..’ అంటూ తీర్పును రిజర్వ్ చేసింది. ఒక అసెంబ్లీ స్థానంలో 5 EVMలలోని ఓట్లను వీవీప్యాట్ స్లిప్పులతో సరిపోల్చు(Verify)తున్నారు. అలా కాకుండా మొత్తం స్లిప్పులను లెక్కించాలని పిటిషనర్లు డిమాండ్ చేస్తుంటే… అది అంత సులభం కాదని EC అంటున్నది.