ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం, మెసేంజర్ యాప్ ‘వాట్సాప్’.. యూజర్ల భద్రతపై మరోసారి క్లారిటీ ఇచ్చింది. తమపై ఒత్తిడి(Pressure) తెస్తే భారత్ లో కార్యకలాపాలు మూసేయడానికి(Shut Down) కూడా రెడీ అని తెలిపింది. యూజర్ల స్వేచ్ఛ(Privacy), వ్యక్తిగత గోప్యత(Secrecy) విషయంలో రాజీ పడేది లేదని ఢిల్లీ హైకోర్టుకు వివరించింది.
ఎండ్-టూ-ఎండ్…
ఎండ్ టూ ఎండ్(End-To-End) ఎన్ క్రిప్షన్ అనేది.. పంపిన వ్యక్తి(Sender), అందుకున్న వ్యక్తి(Recipient) ప్రైవసీకి సంబంధించిన విషయమని, ఈ వివరాల్ని ఎట్టిపరిస్థితుల్లోనూ బయటపెట్టబోమని చెప్పింది మెటా. ‘మేము ఒక ప్లాట్ ఫాం.. ఒకవేళ ఈ సిస్టంను బ్రేక్ చేస్తే వాట్సాప్ భారత్ నుంచి వెళ్లిపోతుంది.. దీనికున్న ప్రైవసీ ఫీచర్ల వల్లే యూజర్లు ఎక్కువగా వాడుతున్నారు.. ప్రపంచంలోనే అత్యధిక మార్కెట్ గల భారత్ లో 400 మిలియన్ల(40 కోట్ల) యూజర్లున్నారు.. వారందరి గోప్యతను కాపాడాల్సిన అవసరముంది.. లేదంటే వాట్సాప్ ఇక్కడ మూసేస్తాం.. అంటూ మెటా ప్రతినిధి తేజస్ కరియా కోర్టు దృష్టికి తెచ్చారు.
పూర్వాపరాలిలా…
కేంద్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 2021 రూల్స్(మధ్యంతర మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా విలువలు) ప్రకారం ఛాటింగ్స్ ను ట్రేస్ చేయడం, మెసేజ్ లు పంపిన అసలైన(Original) వ్యక్తుల్ని గుర్తించాల్సి ఉంది. ఈ రూల్ ను సవాల్ చేసిన వాట్సాప్ మాతృసంస్థ మెటా.. అవసరమైతే మూసేసుకుంటాం తప్ప రాజీపడబోమని తేల్చి చెప్పింది. ఇది దుర్వినియోగమైతే రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్స్ 14, 19, 21 ద్వారా పౌరులకు కల్పించిన ప్రాథమిక హక్కుల్ని కాలరాసినట్లేనని వివరించింది.
వారి మాటల్లోనే…
‘ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి రూల్ లేదు.. చివరకు బ్రెజిల్ దేశంలోనూ ఇలా అడగలేదు.. మెసేజెస్, ఛాటింగ్ ను డిక్రిప్ట్ చేయాల్సి వస్తే ఒక చైన్ సిస్టంనే దాటిపోవాలి.. అలా చేయాలంటే మిలియన్లకు మిలియన్ల మెసేజ్ లను సంవత్సరాల పాటు స్టోరేజ్ చేయాలి.. ఇది మా వల్ల అయ్యే పనికాదు..’ అని వివరించింది.
సర్కారు వాదన ఇలా…
కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది కీర్తిమాన్ సింగ్ వాదనలు వినిపించారు. సోషల్ మీడియా పక్కదారి పడుతున్న ప్రస్తుత రోజుల్లో మెసేజ్ లు తయారు చేసిన వ్యక్తుల్ని గుర్తించాల్సిన అవసరముంది.. ఈ రూల్స్ కు వాట్సాప్ సహకరించాలే చూడాలని కోర్టును కోరారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం.. గోప్యత హక్కు అనేది సంపూర్ణమైనది కాదంటూనే తదుపరి విచారణను ఆగస్టు 14కు వాయిదా వేసింది.