ఒకప్పుడు ఒకే పార్టీలో సహచరులు(Colleagues)…
ఒకే పార్టీలో మంత్రులుగా పనిచేసిన వ్యక్తులు…
ఇప్పుడా ఇద్దరు వేర్వేరు పార్టీల వ్యక్తులయ్యారు…
కానీ ఆ అభిమానం ఊరికే పోదుగా.. ఇద్దరూ ఎదురుపడగానే అలాయ్ భలాయ్ చేసుకున్నారు. రాజకీయాల్లో సీనియర్ ఈటల రాజేందర్, వయసులో సీనియర్ మల్లారెడ్డి మధ్య చాలా కాలం తర్వాత మాట, ముచ్చట కలిసింది. మల్కాజిగిరి నియోజకవర్గంలోని ఫంక్షన్ హాలులో ఇద్దరూ కలుసుకోగానే ఆప్యాయంగా ఒకరికొకరు పలకరించుకున్నారు. ఇద్దరూ ఫొటోలకు ఫోజులిచ్చారు.
‘నువ్వే గెలుస్తున్నావ్ అన్నా.. నా కొడుకు సీటు కూడా నువ్వే గుంజుకున్నవ్.. పదవులు వస్తయ్ పోతయ్.. నువ్వెక్కణ్నో, నేనెక్కణ్నో.. మళ్లెప్పుడు ఎక్కడ కలుస్తమో.. ఆల్ ద బెస్ట్ అన్నా..’ అంటూ నవ్వుతూ ఈటలతో మల్లారెడ్డి అన్నారు.
మల్కాజిగిరి(Malkajigiri) లోక్ సభ సెగ్మెంట్ పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ సీట్లను BRS గెలుచుకుంది. మాజీ మంత్రి మల్లారెడ్డితోపాటు ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి అదే నియోజకవర్గంలో MLAలుగా ఉన్నారు. అలాంటి చోట BJP అభ్యర్థి గెలుస్తారని తమ నేత చెప్పడంతో BRS పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆశ్చర్యపోయారు.