పతంజలి అడ్వర్టయిజ్మెంట్ల(Advertisements) కేసులో ఇండియన్ మెడికల్ అసోసియేషన్(IMA) ప్రెసిడెంట్ కు సుప్రీంకోర్టు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. తీర్పునే ఎగతాళి చేసినట్లు మాట్లాడటంతో IMA అధ్యక్షుడు తమ ఎదుట హాజరు కావాల్సిందేనంటూ జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ ఎహ్సానుద్దీన్ అమానుల్లాతో కూడిన ద్విసభ్య బెంచ్ తేల్చి చెప్పింది. తదుపరి అఫిడవిట్ కు మూడు వారాల గడువిచ్చింది.
ఎగతాళిగా…
పతంజలి కేసులో ఆదేశాల్ని ఉల్లంఘించిన బాబా రాందేవ్ తోపాటు ఆ సంస్థ MD బాలకృష్ణ ఈ ఏప్రిల్ 16న సుప్రీం ఎదుట హాజరయ్యారు. చేసిన తప్పిదంపై ఈ ఇద్దరూ క్షమాపణలు చెప్పినా మీరు అమాయకులు కాదంటూనే పబ్లిక్ గా సమాధానం చెప్పాలని వార్నింగ్ ఇచ్చింది. అస్తమా, గుండె జబ్బుల్ని పూర్తిగా నయం చేస్తామంటూ తప్పుదోవ పట్టించేలా యాడ్స్ ఇచ్చిన కేసులో.. కోర్టు వార్నింగ్ తో అలాంటివి ఇవ్వబోమంటూ పతంజలి హామీ ఇచ్చింది. కానీ మాట మరిచి మెడిసిన్ పై ప్రకటనలు కంటిన్యూ చేసింది.
ఇంటర్వ్యూలో…
సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై IMA ప్రెసిడెంట్ డా. ఆర్.వి.అశోకన్.. న్యూస్ ఏజెన్సీకి ఇంటర్వ్యూ ఇస్తూ ఎగతాళిగా మాట్లాడినట్లు కోర్టు గుర్తించింది. దీనిపై అశోకన్ క్షమాపణలు కోరుతూ అఫిడవిట్ వేస్తే కోర్టు దాన్ని కొట్టివేస్తూ మీరు చేసిన తప్పిదం మామూలిది కాదంటూ హెచ్చరించింది. పతంజలిని అరికట్టే విషయంలో సరైన చర్యలు తీసుకోకపోవడంతోపాటు నిర్లక్ష్యంగా మాట్లాడటంపై తమ ఎదుట హాజరుకావాలని బెంచ్ ఆదేశాలిచ్చింది.