రాష్ట్ర మంత్రివర్గ సమావేశం(Cabinet Meeting)కు ఎన్నికల సంఘం నుంచి రెస్పాన్స్ రాకపోవడంతో వాయిదా వేయాల్సి వచ్చింది. రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ ప్రణాళిక వంటి అంశాలపై ఈరోజు చర్చించేందుకు అజెండాను సర్కారు సిద్ధం చేసింది. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున EC అనుమతి కోరింది. ఏ క్షణమైనా అనుమతి వస్తుందని భావించి సాయంత్రం వరకు మంత్రులంతా సచివాలయం(Secretariat)లోనే ఉన్నారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(CS)తోపాటు అన్ని విభాగాల ఉన్నతాధికారులంతా కేబినెట్ భేటీ కోసం రెడీ అయ్యారు. జూన్ 2 నాడు నిర్వహించ తలపెట్టిన రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లపైనా ఈ మీటింగ్ లో చర్చించాల్సి ఉంది. రెండు రాష్ట్రాల పెండింగ్ సమస్యలు, పునర్విభజన చట్టంలోని అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుందామనుకున్నా ఎన్నికల సంఘం నుంచి స్పందన రాలేదు.
EC నుంచి ఎప్పుడు పర్మిషన్ వస్తే అప్పుడే కేబినెట్ భేటీ జరపాలని ముఖ్యమంత్రి రేవంత్ నిర్ణయం తీసుకున్నారు. సోమవారం లోపు అనుమతి రాకపోతే ప్రత్యామ్నాయ(Alternative) మార్గాలు ఆలోచించాలన్న భావనకు వచ్చారు. అవసరమైతే మంత్రులతో కలిసి ఢిల్లీ వెళ్లి ఎన్నికల అధికారుల్ని కలవాలన్న సమాలోచన జరిగినట్లు తెలుస్తున్నది.