అప్రతిహత విజయాలతో అగ్రస్థానం నిలబెట్టుకుని…
అలవోకగా ప్రత్యర్థుల్ని మట్టికరిపించి ఫైనల్ చేరుకుని…
తనకు తిరుగులేదన్న రీతిలో దూసుకువచ్చి…
ఏకంగా కప్పునే ఎగరేసుకుపోయింది కోల్ కతా నైట్ రైడర్స్.
ఐపీఎల్-17లో తిరుగులేని విధంగా విజయాలు సాధించిన KKR.. ఫైనల్లోనూ సత్తా చూపించింది. సన్ రైజర్స్ హైదరాబాద్ కు చుక్కలు చూపించి మరీ కప్పును కైవసం చేసుకుంది. తొలుత 18.3 ఓవర్లలో 113 పరుగులకే SRHను మట్టికరిపించిన KKR.. ఆ తర్వాత సునాయాసం(Easy)గా టార్గెట్ ను ఛేదించింది. కేవలం 10.3 ఓవర్లలోనే 2 వికెట్లకు 114 రన్స్ చేసి 8 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.
నరైన్ ఔటయ్యాక…
అసలే తక్కువ టార్గెట్. హైదరాబాద్ ఎలా వికెట్లు కోల్పోయిందో కోల్ కతా సైతం కష్టాలు పడుతుందన్న ఆశతో కనిపించారు SRH ఫ్యాన్స్. సూపర్ ఫామ్ లో ఉన్న సునీల్ నరైన్(2) అనుకున్నట్లుగానే తొందరగా ఔటయ్యాడు. కానీ ఆ ఆనందం అంతవరకే ఆగిపోయింది. రహ్మనుల్లా గుర్బాజ్, వెంకటేశ్ అయ్యర్ క్రీజులో పాతుకుపోయారు. ముఖ్యంగా వెంకటేశ్ తొలి 14 బంతుల్లోనే 41 రన్స్ చేశాడు. 11కే ఫస్ట్ వికెట్ కోల్పోయినా మరో వికెట్ పడకుండా రెండో వికెట్ కు 25 బంతుల్లోనే 50 పరుగులు జత చేసింది ఈ జోడీ.