నైరుతి రుతుపవనాలు(Southwest Monsoon) తెలంగాణలోకి ప్రవేశించాయి. దీంతో వచ్చే మూడు రోజుల పాటు వివిధ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. రాష్ట్రంలో చురుగ్గా కదులుతున్న రుతుపవనాల ప్రభావంతో ఇంచుమించు చాలా జిల్లాల్లో వానలు పడబోతున్నాయి.
సాధారణంగా జూన్ రెండో వారంలో రాష్ట్రంలోకి ప్రవేశించే రుతుపవనాలు ఈసారి వారం ముందుగానే పలకరించాయి. జూన్ తొలివారం చివరికల్లా రాష్ట్రంలోకి రావచ్చని భారత వాతావరణ శాఖ(IMD) అంచనా వేసినా అంతకు ముందుగానే వచ్చేశాయి. గత సంవత్సరంతో పోల్చితే ఈ ఏడాది సాధారణం(Normal) కంటే ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశముందని తెలిపింది.
ఈ నెల 4న నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని IMD ప్రకటించింది.