పరిపాలనాదక్షుడిగా పేరున్న బిహార్(Bihar) ముఖ్యమంత్రి నితీశ్ కుమార్.. తరచూ కూటములు మారి అపవాదు తెచ్చుకున్నారు. ఎక్కడా నిలకడగా ఉండరన్న అపప్రథ మూటగట్టుకున్నారు. ఒకసారి NDA, మరోసారి కాంగ్రెస్ కూటమి.. ఇలా దాన్నుంచి దీనికి, ఇటు నుంచి అటు అన్నట్లుగా కప్పదాట్లకు దిగారు. దీంతో ఆయనపై దేశ రాజకీయాల్లో అనుమానాలు ఎక్కువయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆశ్చర్యకర సన్నివేశం చోటుచేసుకుంది.
జంటగా…
లోక్ సభ ఎన్నికల రిజల్ట్స్ అనంతరం అటు NDA ఇటు I.N.D.I.A. పక్షాలు ఈ రోజు ఢిల్లీలో భేటీలు(Meetings) ఏర్పాటు చేశాయి. ఈ సమావేశాలకు అటు నితీశ్ కుమార్, ఇండియా పక్షాల తరఫున RJD నేత తేజస్వి యాదవ్ హస్తినకు వెళ్లారు. అయితే ఈ ఇద్దరూ ఒకే విమానంలో వెళ్లడం ఆశ్చర్యకరమైతే ఆ ఇద్దరూ పక్కపక్క సీట్లోనే కూర్చోవడం విశేషంగా మారింది.
బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ ఉన్న సమయంలోనే లాలూ ప్రసాద్ యాదవ్ వారసుడు ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. నితీశ్ పార్టీ JDU(జనతాదళ్-యు)తో RJD(రాష్ట్రీయ జనతా దళ్) జట్టుకట్టడంతో లాలూ కుటుంబానికి ప్రభుత్వంలో ప్రాధాన్యత ఇవ్వాల్సి వచ్చింది. కొద్దిరోజుల క్రితం నితీశ్ తిరిగి NDA కూటమికి చేరడం, ఇప్పుడు వారిద్దరూ పక్కపక్క సీట్లోనే జర్నీ చేయడంతో బిహార్ CM మరోసారి ప్లేటు ఫిరాయిస్తారా అన్న మాటలు దేశ రాజకీయాల్లో సంచలనంగా మారాయి.