నీట్ యూజీ-పరీక్ష 2024(NEET-UG) లీక్ అయిందన్న ఆరోపణలపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఒకే సెంటర్లో పరీక్షలు రాసిన పలువురికి టాప్ ర్యాంకులు రావడం, మాల్ ప్రాక్టీస్ జరగడం వంటి కారణాలతో తిరిగి పరీక్షను నిర్వహించాలంటూ సర్వోన్నత న్యాయస్థానం(Supreme Court)లో పలువురు అభ్యర్థులు పిటిషన్ వేశారు.
పరీక్షల పవిత్రత(Sanctity) దెబ్బతింటున్నదని భావిస్తున్నందున ఎక్కడో ఏదో రకమైన సమస్యలు ఉన్నాయని.. తిరిగి పరీక్షలు నిర్వహించడంపై నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ(NTA)కి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పరీక్షల లీక్ అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14(సమానత్వపు హక్కు)ను దెబ్బతీయడమేనని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు విన్నవించారు. దీంతో జులై 8 లోపు దీనిపై వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది. అయితే కౌన్సెలింగ్ పై స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.
ఈ కేసు రేపు విచారణకు వచ్చే అవకాశాలున్నాయి. అయితే ఇప్పటికే దీనిపై విద్యార్థి సంఘాలు పెద్దయెత్తున ఆందోళనలు చేస్తున్నాయి. నీట్-యూజీ ఫలితాల్ని ఈనెల 5న ప్రకటించగా.. అందులో 67 మందికి అచ్చంగా 720 మార్కులే వచ్చాయి. హర్యానాలోని ఒక సెంటర్లో పరీక్ష రాసిన ఆరుగురు జాయింట్ టాపర్స్ గా నిలిచారు. ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లోని MBBS, BDS, ఆయుష్ కోర్సుల కోసం నీట్-యూజీ పరీక్షలు జరిగాయి.