ఆదివాసీల్లో విద్యావంతుడతడు.. సర్పంచిగా, టీచర్ గా, ఆర్ఎస్ఎస్, ఆదివాసీల కోసం పోరాడే లాయర్ గా, మైనింగ్ మాఫియాకు బద్ధ శత్రువుగా బహుముఖ రంగాల్లో సేవలందించారాయన. MLAగా సర్కారునే ఇరుకున పెట్టిన ఆయనకు కనీసం ఇల్లు(Quarter) కూడా కేటాయించలేదు. దీంతో అసెంబ్లీ సమావేశాలకు అటెండ్ అవ్వాలంటే ఫుట్ పాతే దిక్కు అనుకుని కొన్ని రోజుల పాటు అక్కడే పడుకున్నారు. ఇలా జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న ఆయనే… ప్రస్తుతం ఒడిశా CMగా బాధ్యతలు చేపట్టిన మోహన్ చరణ్ మాఝీ.
తొలి వ్యక్తిగా…
52 ఏళ్ల మాఝీ.. ఒడిశాకు తొలి ఆదివాసీ ముఖ్యమంత్రి. కియోంఝర్ నుంచి నాలుగు సార్లు MLAగా గెలిచిన ఆయన రాజకీయ ప్రస్థానం.. ఎన్నో కష్టాలను ఎదురొడ్డింది. రాయ్కలా సదర్ రీజియన్ కు చెందిన ఈయన.. ఆదివాసీ వర్గానికి ఏదో ఒకటి చేయాలన్న కోరికతో చిన్నప్పట్నుంచి ఉండేవారు. దీన్ని గుర్తించిన సదరు కమ్యూనిటీ ఆయన్ను బాగా చదివించింది. అలా ‘లా’ చదువుతూనే RSSకు అనుబంధంగా ఉండే సరస్వతీ శిశు విద్యా మందిర్లో సేవలందించారు.
సర్పంచిగా…
1997-2000 వరకు సర్పంచిగా పనిచేశారు మోహన్ చరణ్. BJPలో ఏ పని అప్పగించినా కార్యదక్షతతో పూర్తిచేశారు. ఆదివాసీ మోర్చా, 2005-2009 మధ్య BJDతో పొత్తులో డిప్యుటీ చీఫ్ విప్ గా.. 2019లో చీఫ్ విప్ గా పనిచేశారు. MLA అయినా 2004లో క్వార్టర్స్ కేటాయించకపోవడంతో అసెంబ్లీ సెషన్స్ కోసం ఫుట్ పాత్ పైనే పడుకునేవారు. ఆ రోజుల్లో కిరాయి(Rent)కి ఇల్లు దొరకలేదని, చివరకు ఫుట్ పాత్ పై పడుకుంటే తన ఫోన్ కూడా దొంగిలించారని అప్పటి స్పీకర్ ఎస్.ఎన్.పాట్రోకు తెలిపారు.
ఇప్పుడూ ఇల్లు కోసం…
ఆశ్చర్యకరంగా ఆయన ఇంటి కోసం ఇప్పుడు కూడా అధికారులు వేటలో పడ్డారు. గత 24 ఏళ్లుగా CMగా ఉన్న నవీన్ పట్నాయక్ భువనేశ్వర్లో ప్రైవేటు నివాసంలోనే ఉండటంతో సర్కారీ క్వార్టర్స్ అవసరం రాలేదు. మైనింగ్ మాఫియా వల్ల కొంతమంది MLAలకు ప్రాణహాని ఉందని 2022లో అసెంబ్లీలో మాఝీ ప్రస్తావించారు. అంతకుముందు 2021లో కియోంఝర్లో బైక్ పై వెళ్తున్న టైంలో దుండగులు బాంబులు వేయడంతో మాఝీ తప్పించుకున్నా బైక్ మాత్రం కాలిపోయింది.
ఈయనకు సతీమణి ప్రియాంక మరాండీ, ఇద్దరు కుమారులున్నారు. ద్రౌపది ముర్ము రాష్ట్రపతి అయ్యాక ఆదివాసీల నుంచి CM అయి అత్యంత పెద్ద పదవి దక్కించుకున్న వ్యక్తిగా మోహన్ చరణ్ మాఝీ చరిత్రలో నిలిచిపోయారు.