నీట్ యూజీ-2024 పరీక్షలపై గందరగోళం నెలకొన్న వేళ ఎన్టీఏ(National Testing Agency) సంచలన నిర్ణయం తీసుకుంది. గ్రేస్ మార్కుల్ని రద్దు చేస్తున్నట్లు స్వయంగా సుప్రీంకోర్టుకు తెలిపింది. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై దాఖలైన పిటిషన్లను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం.. NTAకు నోటీసులు జారీ చేసింది. అయితే నీట్ కౌన్సెలింగ్ పై స్టే ఇచ్చేందుకు నిరాకరిస్తూ(Reject)నే తదుపరి విచారణను జులై 8కి వాయిదా వేసింది. అప్పట్లోగా సమాధానం ఇవ్వాలని NTAను ఆదేశించింది.
అసలు కథ ఇదే..
నీట్ యూజీలో 1,563 విద్యార్థులకు గ్రేస్ మార్కులు వచ్చాయి. వీరికి గ్రేస్ మార్కులు ఇవ్వడంపై అనుమానాలు ఏర్పడటం, సదరు 1,563 మంది ర్యాంకులపై సందేహాలు నెలకొన్న వేళ ఈ గ్రేస్ మార్కుల్ని రద్దు చేస్తున్నట్లు కోర్టుకు NTA తెలిపింది. గ్రేస్ మార్కులు కాకుండా కేవలం ఒరిజినల్(Original) మార్కులతోనే కౌన్సెలింగ్ కు వెళ్లొచ్చని క్లారిటీ ఇచ్చింది. ఈ విషయంలో తాము నియమించిన కమిటీ నివేదిక(Report)ను కోర్టుకు వివరించింది.
క్వశ్చన్ పేపర్ లీకేజీ, ఇతర అక్రమాలపై అబ్దుల్లా మహ్మద్ ఫైజ్, కార్తీక్ అనే వ్యక్తులు.. గ్రేస్ మార్కులపై ‘ఫిజిక్స్ వాలా’ విద్యా సంస్థ ఫౌండర్ అలఖ్ పాండే పిటిషన్లు వేశారు. నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ మే 5న దేశవ్యాప్తంగా 4,750 సెంటర్లలో జరిగింది. 24 లక్షల మంది పరీక్ష రాస్తే అందులో 67 మందికి 720/720 మార్కులు వచ్చాయి.
మరో ఆప్షన్…
అయితే గ్రేస్ మార్కులు కావాలనుకున్నవారు మళ్లీ ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుందని NTA స్పష్టం చేసింది. ఇందుకోసం ఈ నెల(జూన్) 23న మరోసారి పరీక్ష నిర్వహిస్తామని, వాటి రిజల్ట్స్ ను 30న ప్రకటిస్తామని గుర్తు చేసింది. గ్రేస్ మార్కుల కోసం నిర్వహించే పరీక్ష అనంతరం జరిగే కౌన్సెలింగ్ కు హాజరుకావచ్చని తెలియజేసింది.