దేశానికి తలమానికంగా నిలిచే ఎర్రకోటపై దాడికి పాల్పడ్డ ఉగ్రవాదికి క్షమాభిక్ష(Mercy) పెట్టేందుకు రాష్ట్రపతి నిరాకరించారు. సదరు అభ్యర్థనను తోసిపుచ్చుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిర్ణయం తీసుకున్నారు. పాకిస్థాన్ ఉగ్రవాది మహ్మద్ ఆరిఫ్ అలియాస్ అష్ఫాక్ కు ఇప్పటికే మరణశిక్ష పడింది.
అప్పుడేం జరిగిందంటే…
24 ఏళ్ల క్రితం 2000 డిసెంబరు 22న ఢిల్లీలోని ఎర్రకోట(Red Forte)పై దాడి జరిగింది. ఇద్దరు లష్కర్-ఇ-తొయిబా తీవ్రవాదులు(Terrorists) రెడ్ ఫోర్ట్ పరిసరాల్లో కాల్పులకు తెగబడ్డారు. అక్కడ డ్యూటీలో ఉన్న ముగ్గురు 7వ రాజ్ పుతానా రైఫిల్స్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.
అలా దొరికారు…
ఆరిఫ్ కాల్పులు జరుపుతుండగా జేబులో నుంచి పేపర్ కింద పడింది. అందులో ఫోన్ నంబర్, అడ్రస్ ఉన్నాయి. దీంతో 3 రోజుల తర్వాత అతణ్ని ఢిల్లీ ఘాజీపూర్‌లోని ఆయన ఇంట్లో అరెస్టు చేశారు. అతడికి ఢిల్లీ హైకోర్టు 2007లో మరణశిక్ష విధిస్తే, 2011లో సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ తీర్పుపై 2022 నవంబరు 23న ఆరిఫ్ రివ్యూ పిటిషన్ వేస్తే ముగ్గురు సభ్యుల సుప్రీం బెంచ్ రిజెక్ట్ చేసింది.
ఇది రెండోది…
ఆరిఫ్ రెండుసార్లు క్షమాభిక్ష అడిగాడు. ఈ మే 15న లెటర్ రాస్తే అదే నెల 27న రాష్ట్రపతి తిరస్కరించారు. మరోవైపు ముర్ముకు ఇది రెండో క్షమాభిక్ష పిటిషన్. బాలికపై హత్యాచారం కేసులో గతంలో వసంత సంపత్ దుపారే క్షమాభిక్ష పిటిషన్ వేశాడు. ఇప్పుడీ ప్రెసిడెంట్ నిర్ణయాన్ని సుప్రీంలో సవాల్ చేసే అవకాశముంది. కానీ మోదీ సర్కారు తెచ్చిన భారతీయ నాగరిక్ సురక్షా సంహిత(BNSS) జులై 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఈ చట్టం ప్రకారం రాష్ట్రపతి నిర్ణయాన్ని ప్రశ్నించే ఛాన్స్ ఉండదు.