టీచర్ల బదిలీలు, ప్రమోషన్లలో భాగంగా వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభమైంది. శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు గడువిచ్చారు. అయితే ఈ విషయంలో మాస్టార్ల మధ్య మరోసారి అగ్గి రగులుతున్నది. లాంగ్వేజ్ పండిట్లు, పీఈటీ, PS HM ప్రమోషన్ల విషయంలో అసంతృప్తిగా ఉన్న ఉపాధ్యాయులు తీవ్ర ఆవేదనతో కనిపిస్తున్నారు. అవసరమైతే మాతృ సంఘాలకు రాజీనామా చేయాలన్న ఆలోచనతో కనిపిస్తున్నారన్న ప్రచారం జరుగుతున్నది.
వివాదమిలా…
PS HM పోస్టులకు గాను BED, DED టీచర్ల మధ్య వివాదం కోర్టులో నడుస్తున్నది. అయితే PS HM పోస్టులను డీఎడ్/టీటీసీలకే ఇవ్వాలన్న నిర్ణయంతో సీనియారిటీ లిస్టును వారికి అనుకూలంగా రిలీజ్ చేశారు. ఈ విషయంలో బీఎడ్ టీచర్లు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతూ మాతృసంఘాలపై గుర్రుగా ఉన్నారు. తమ సంఘమే పట్టించుకోవడం లేదన్న కోపంతో అందులోని పదవులకు రాజీనామా చేసేందుకు కొందరు సిద్ధమవుతున్నారు.
ఎల్.పి.లు సైతం…
లాంగ్వేజ్ పండిట్లను స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోట్ చేసే విషయంలోనూ ఆగ్రహం కనిపిస్తున్నది. లాంగ్వేజ్ పండిట్, PET పోస్టులను స్కూల్ అసిస్టెంట్ లుగా అప్ గ్రేడ్ చేసే విషయంలో తెలుగు, హిందీ, పీఈటీ మెథడాలజీ గల SGTలను పరిగణలోకి తీసుకోకపోవడం వల్ల అర్హత గల సీనియర్లు ఆవేదనతో ఉన్నారు. ఈ విషయంలో ప్రధాన సంఘాలు గోడు వినిపించుకోవడం లేదని లోలోపన మథనపడుతున్నారు.
నిరసనలు…
PS హెచ్ఎంలకు అన్యాయం చేస్తున్నారంటూ భాషా పండితులకు స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు కల్పిస్తుండటాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో నిరసనలు చేపట్టారు. పలు ప్రాంతాల్లో SGTలు శనివారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనకు దిగారు. ఈ నెల 18న అన్ని మండల కేంద్రాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి తహసీల్దార్లకు వినతిపత్రాలు అందజేస్తామని ప్రకటించారు.