కాంచనజంగా(KanchanaJanga) ఎక్స్ ప్రెస్ ను గూడ్స్ ఢీకొట్టిన ప్రమాదంతో మరోసారి రైలు ప్రయాణంపై ఆందోళన ఏర్పడుతున్నది. గతేడాది ఒడిశాలోని బాలాసోర్ లో జరిగిన ఘటన మరవకముందే మరోసారి అలాంటి దుర్ఘటనే(Incident) జరిగింది. ఆనాడు ఊహించని ప్రాణనష్టం జరిగితే ఈరోజు సైతం అదే రీతిలో ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ప్రమాదాల్ని అరికట్టేందుకు ‘కవచ్’ సిస్టమ్ ను తీసుకురావాల్సి ఉన్నా అది అమలు కాకపోవడంతో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి.
దేశంలోని అతిపెద్ద రైలు ప్రమాదాలు ఇవే…
* 2023 జూన్లో ఒడిశా బాలాసోర్ వద్ద జరిగిన ప్రమాదంలో 293 మంది ప్రాణాలు కోల్పోతే 1,000 మంది గాయపడ్డారు. కోరమాండల్ ఎక్స్ ప్రెస్-గూడ్స్ రైళ్లు ఢీకొన్నాయి.
* 2016లో ఇండో-పాట్నా ఎక్స్ ప్రెస్ ఉత్తరప్రదేశ్ లో పట్టాలు తప్పడంతో 146 మంది మృత్యువాత పడ్డారు.
* 2010 మే 28న పశ్చిమబెంగాల్ రాజధాని కోల్ కతాకు 83 మైళ్ల దూరంలో రెండు రైళ్లు ఢీకొట్టుకున్న ఘటనలో 146 మంది మరణించగా, 200 మంది గాయపడ్డారు.
* 2002లో కలకత్తా నుంచి న్యూఢిల్లీ వెళ్తున్న రాజధాని ఎక్స్ ప్రెస్ పై విద్రోహ చర్య(Sabotage)తో ఆ రైలు ధాబి నదిలో పడిపోయి 120 మృతిచెందారు.
* 1999 ఆగస్టు 2న పశ్చిమ్ బెంగాల్లోని గైసాల్ లోనూ రైళ్లు ఢీకొట్టి 285 మంది చనిపోతే, 312 మంది గాయాల పాలయ్యారు.
* 1998లో సీల్దా ఎక్స్ ప్రెస్ పంజాబ్ లో ఇంకో రైలును ఢీకొట్టి పట్టాలు తప్పడంతో 210 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
* 1995 ఆగస్టు 20న ఉత్తరప్రదేశ్ ఆగ్రా సమీపంలోని ఫిరోజాబాద్ లో రెండు రైళ్లు ఢీకొని 300 మంది మృతిచెందగా, 344 మంది గాయపడ్డారు.
* భారతదేశ చరిత్రలోనే అత్యంత విషాదకర ఘటన 1981 జూన్ 6న జరిగింది. బిహార్లోని మేహెమ్ వద్ద రెండు రైళ్లు ఢీకొని నదిలో పడటంతో 800 మందికి పైగా మరణించారు.
* 1956 నవంబరు 23న వచ్చిన వరదలకు బ్రిడ్జి కూలిపోయి మరుద్యార్(Marudyar) నదిలో రైలు పడి 154 మంది ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి.