ఇక తామెంత మాత్రం పసికూనలు కాదని చిన్న జట్లు నిరూపిస్తున్నాయి. ఇప్పుడు అలాంటి మ్యాజిక్ షోనే ఆస్ట్రేలియా-అఫ్గాన్ మ్యాచ్ లో జరిగింది. గ్రూప్ స్జేజ్ నుంచి ఇప్పటిదాకా దూసుకుపోతున్న కంగారూలు.. అఫ్గాన్ దెబ్బకు విలవిల్లాడాల్సి వచ్చింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ 6 వికెట్లకు 148 స్కోరు చేసింది. చిన్న టార్గెట్ తో బరిలోకి దిగిన ఆసీస్.. 19.2 ఓవర్లలో 127 పరుగులకే కుప్పకూలి 21 రన్స్ తేడాతో ఘోర పరాజయం తెచ్చుకుంది.
ఓపెనర్ల హవా…
అఫ్గాన్ ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్(60), ఇబ్రహీం జద్రాన్(51) కంగారూ బౌలర్లకు చుక్కలు చూపించారు. టాప్ క్లాస్ బౌలర్లంతా 118 స్కోరు వరకు ఒక్క వికెట్ తీయలేకపోయారు. అంతలా నిలదొక్కుకున్న ఈ ఇద్దరిలో ముఖ్యంగా గుర్బాజ్ 4 సిక్సులు, మరో 4 ఫోర్లతో హడలెత్తించాడు. తర్వాత ఏ ఒక్కరూ ఆడకపోవడంతో అఫ్గాన్ స్కోరు 148 వద్ద ఆగిపోయింది.
ఆ తర్వాత చుక్కలే…
ఆస్ట్రేలియా బ్యాటింగ్ లో గ్లెన్ మ్యాక్స్ వెల్(59) మాత్రమే నిలబడ్డాడు. మిగతా ఏ ఒక్కరూ 20 పరుగులు కూడా దాటకపోవడంతో ఆసీస్ పరాజయం ఖరారైంది. మ్యాక్స్ వెల్ తర్వాత ఎక్స్ ట్రాల ద్వారా వచ్చినవే(16 పరుగులు) సెకండ్ ప్లేస్ లో ఉన్నాయి. గుల్బదిన్ నయీబ్ 4, నవీన్ ఉల్ హక్ 3 వికెట్లతో ఆస్ట్రేలియా వెన్నువిరిచారు.