జగిత్యాల జిల్లా కేంద్రంగా నిన్న అర్థరాత్రి నుంచి సాగుతున్న పరిణామాలు ఆసక్తికరం(Interesting)గా మారాయి. అక్కడి MLA సంజయ్ కుమార్ BRS నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరడం తీవ్ర వివాదానికి దారితీసింది. ప్రభుత్వ విప్ లు వచ్చి సముదాయించినా బెట్టు వీడని సీనియర్ నేత టి.జీవన్ రెడ్డి కోసం ఏకంగా మంత్రి శ్రీధర్ బాబు రంగప్రవేశం చేశారు.
అలా జరిగింది…
BRS నుంచి గెలిచిన సంజయ్ నిన్న అర్థరాత్రి CM చేతుల మీదుగా హస్తం కండువా కప్పుకున్నారు. స్వతహాగా డాక్టర్ అయిన ఆయన జగిత్యాల నుంచి 2 సార్లు వరుసగా గెలిచారు. కాంగ్రెస్ MLC జీవన్ రెడ్డే ఆయనకు ప్రత్యర్థిగా ఉన్నారు. 40 ఏళ్లుగా ఈ కాంగ్రెస్ సీనియర్ లీడర్ అన్నీ తానై వ్యవహరిస్తూ ఉమ్మడి జిల్లాకు కీలక నేతగా ఎదిగారు. అలాంటి తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే సంజయ్ ని చేర్చుకోవడం ఆవేదన, ఆగ్రహాన్ని తెప్పించింది.
రాజీనామాకు రెడీ…
దశాబ్దాల పాటు పార్టీలో క్రియాశీలకంగా ఉంటున్న తనను పరిగణలోకి తీసుకోకుండా వ్యవహరించిన తీరుపై మనస్తాపం చెందిన తాటిపర్తి జీవన్ రెడ్డి.. తన MLC పదవికి రాజీనామా చేస్తానన్న నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. అదే జరిగితే ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ కు తీరని నష్టమని, పార్టీ ఫ్యూచర్ తోపాటు వచ్చే ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపుతుందన్న భావన ఏర్పడింది.
రంగంలోకి…
సంజయ్ చేరికపై ఒకవైపు BRS ఆందోళనలు చేస్తుంటే.. మరోవైపు జీవన్ రెడ్డి రాజీనామా అంశంతో జగిత్యాల పాలిటిక్స్ గరం గరంగా మారాయి. దీంతో ఈ సీనియర్ ను సముదాయించేందుకు ఆయన ఇంటికి ప్రభుత్వ విప్ లు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్ చేరుకున్నారు. ఈ ఇష్యూ మీద పైస్థాయిలోనూ తర్జనభర్జనలు జరుగుతున్నాయి. అయినా శాంతించకపోవడంతో జీవన్ రెడ్డికి నచ్చజెప్పేందుకు మంత్రి శ్రీధర్ బాబు జగిత్యాలకు చేరుకున్నారు.
శ్రీధర్ బాబు నచ్చజెప్పడంతో చివరకు జీవన్ రెడ్డి శాంతించారు. అయితే సీనియర్ లీడర్ కు హామీ ఇచ్చే స్థాయి తమది కాదని, జరిగిన పరిణామాలపై హైకమాండ్ కు నివేదిస్తానని మంత్రి అన్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్షీ ద్వారా వివరాల్ని ఢిల్లీ పెద్దలకు చేరవేస్తానన్నారు. తాను పార్టీ నియమ నిబంధనల్ని పాటిస్తానంటూ స్వయంగా జీవన్ రెడ్డే చెప్పడంతో కథ సుఖాంతమైంది.