ప్రకృతి అందాలు, పరవశింపజేసే పర్యావరణం.. పశ్చిమాన అరేబియా సముద్రం(Ocean), తూర్పున పశ్చిమ కనుమలు.. 44 నదులతో అలరారే సౌందర్యం.. ఒకటేమిటి కేరళ వాతావరణం గురించి ఎంత చెప్పినా తక్కువే. అందుకే ఆ రాష్ట్రాన్ని దేవభూమిగా పిలుస్తారు. అలాంటి కేరళ రాష్ట్ర పేరును మార్చుతూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానాన్ని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రవేశ పెట్టారు.
‘కేరళం’ అంటే…
పూర్వీకుల నుంచి సంప్రదాయంగా పిలుచుకున్న పేరు ‘కేరళం’. ‘కేర’ అంటే కొబ్బరిచెట్టు కాగా.. ‘అళం’ అంటే భూమి. కొబ్బరిచెట్ల భూమి అనేది ఒక వాదన. చేర, అళం అంటే చేరుల భూమి అనే మాట నుంచి ‘కేరళం’ వచ్చిందనేది మరో వాదన. ట్రావెన్కోర్(తిరువాన్కూరు) రాజు రాజా మార్తాండ వర్మ తన రాజ్యాన్ని తిరువనంతపురంలోని అనంతపద్మనాభస్వామికి అంకితం చేసి అతని దాసునిగా రాజ్యాన్ని పాలించాడు. అతని తర్వాతి వారసులు కూడా అలాగే చేయడం, రాజముద్రలు దేవుడి పేరు మీదే ఉండటం వల్ల కేరళను దేవుని సొంత భూమిగా భావిస్తారు.
ఇంకోమాటగా…
మలయాళం మాట్లాడే ప్రజలు, ఐక్య కేరళను ప్రతిబింబించే పేరుగా ‘కేరళం’ను చెప్పుకుంటారు. భాషా ప్రాతిపదికన 1956 నవంబరు 1న కొత్త రాష్ట్రాలు ఏర్పడగా.. నవంబరు 1 నాడు కేరళీయులు ‘కేరళప్పిరవి’ దినోత్సవాన్ని జరుపుకొంటారు. స్వాతంత్ర్య పోరాట కాలం నుంచీ ‘కేరళం’ డిమాండ్ ఉంది.
ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపనుండగా, 2023 ఆగస్టులోనూ ఈ తరహా తీర్మానాన్నే చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం ‘కేరళం’గా సవరించడానికి తగిన చర్యలు తీసుకోవాలని అక్కడి అసెంబ్లీ కోరింది. 8వ షెడ్యూల్ లో పేర్కొన్న అన్ని అధికారిక(Official) భాషల్లోనూ పేరు మార్చేలా చూడాలంటూ తీర్మానం చేశారు.