స్పిన్నర్లు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ అద్భుత బౌలింగ్ తో పోటాపోటీగా వికెట్లు తీయడంతో పొట్టి ఫార్మాట్ ప్రపంచకప్ లో భారత్ ఫైనల్ కు దూసుకెళ్లింది. 172 టార్గెట్ తో బరిలోకి దిగిన బ్రిటిష్ జట్టు 49కే ఐదు కీలక వికెట్లు పోగొట్టుకుంది. అంతకుముందు రోహిత్(57; 39 బంతుల్లో 6×4, 2×6) సూర్య(47; 36 బంతుల్లో 4×4, 2×6) బ్యాటింగ్ తో టీమ్ఇండియా 171/7 చేసింది.
సాల్ట్(5), బట్లర్(23), మొయిన్(8), బెయిర్ స్టో(0), శామ్ కరణ్(2), లివింగ్ స్టోన్(11), బ్రూక్(25) తొందరగానే ఔటయ్యారు. సాల్ట్ ను బుమ్రా.. ఆ తర్వాత వరుసగా ముగ్గుర్ని అక్షర్ వెనక్కు పంపాడు. ముందుగా అక్షర్, తర్వాత కుల్దీప్ మూడేసి వికెట్లతో ఇంగ్లండ్ భరతం పడితే బుమ్రా 2 వికెట్లు తీసుకున్నాడు.
చివర్లో రెండు అద్భుత రనౌట్లతో ఇంగ్లండ్ పనైపోయింది. 103 పరుగులకే ఆలౌట్ కావడంతో 68 పరుగు తేడాతో భారతజట్టు విజయం సాధించింది. ఈ నెల 29న జరిగే ఫైనల్లో భారత్, దక్షిణాఫ్రికా తలపడతాయి. మూడోసారి ప్రపంచకప్ ఫైనల్ చేరిన టీమ్ఇండియా.. 2007లో అరంగేట్ర కప్పును సాధించి 2014 ఫైనల్లో ఓడింది.