అది ఐదు రోజుల పాటు సాగే టెస్ట్ మ్యాచ్. కానీ భారత మహిళల బాదుడుతో టీ20లా మారిపోయింది. తొలి రోజే 500కు పైగా పరుగులు వచ్చాయంటే ఆ ఊచకోత ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఓపెనర్లు షెఫాలి వర్మ, స్మృతి మంధాన తొలి వికెట్ కు 292 పరుగులు జోడించడంతో స్కోరు బోర్డుపై పరుగులే పరుగులు.
షెఫాలి హైలెట్…
తొలుత స్మృతి మంధాన(149; 161 బంతుల్లో 27×4, 1×6) సెంచరీ చేసి ఔటైంది. కానీ ఆ టెంపోను కంటిన్యూ చేసిన షెఫాలి(205; 197 బంతుల్లో 23×4, 8×6) డబుల్ సెంచరీతో సౌతాఫ్రికాకు చుక్కలు చూపించింది. జెమిమాతో మిస్ కమ్యూనికేషన్ వల్ల రనౌట్ అయిందే గానీ లేకపోతే ఆమె దూకుడుకు మరింత దుమ్మురేగేదే.
వరల్డ్ రికార్డ్…
సతీశ్ శుభ(15) ఔటైనా జెమిలా రోడ్రిగ్స్(55) నిలబడింది. తొలిరోజు ఆట ముగిసే సమయానికి భారత్ 525/4 చేసింది. హర్మన్(42 బ్యాటింగ్), రిచా(43 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. భారత పురుషులు, మహిళల టెస్ట్ క్రికెట్లో ఫస్ట్ డే వచ్చిన హయ్యెస్ట్ స్కోరు ఇదే. 2002లో బంగ్లాపై శ్రీలంక చేసిన 509/9 ఇప్పటిదాకా ఉన్న వరల్డ్ రికార్డ్. ఇప్పుడీ దాన్ని మన ఉమెన్ టీమ్ తిరగరాసింది.