ముఖ్యమంత్రి సహాయనిధి(Relief Fund) డబ్బులు ఇంతకుముందు ఎలా పక్కదారి పట్టాయో చూశాం. దానిపై విచారణలు కూడా జరిగాయి. ఇకముందు అలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్(Online) విధానానికి శ్రీకారం చుట్టింది. ఇకనుంచి అప్లికేషన్లన్నీ ఆన్లైన్ ద్వారానే రావాల్సి ఉంటుంది. ఇందుకోసం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో వెబ్సైట్(Website) తయారు చేశారు.
సిఫార్సు లేఖలతో…
ముఖ్యమంత్రి సహాయనిధి అప్లికేషన్లను వెబ్సైట్లో అప్ లోడ్ చేసేందుకు గాను MLA, MLCలు ఇచ్చే సిఫార్సు లేఖ జత చేయాల్సి ఉంటుంది. ఈనెల 15 తర్వాత CMRF దరఖాస్తుల్ని ఆన్లైన్లో మాత్రమే స్వీకరిస్తారు. ఇందుకోసం http//cmrf.telangana.gov.in లో దరఖాస్తు చేసుకోవాలి. సదరు అప్లికేషన్లో దరఖాస్తుదారుడి బ్యాంక్ అకౌంట్ నంబర్ తప్పనిసరిగా ఉండాలి. అప్ లోడ్ అయిన తర్వాత CMRFకు సంబంధించిన కోడ్ ఇస్తారు.
ఆ తర్వాత…
CMRF కోడ్ ఆధారంగా ఒరిజినల్ మెడికల్ బిల్లులను సచివాలయంలో అందజేయాల్సి ఉంటుంది. ఆ దరఖాస్తుల్ని ఆన్లైన్ ద్వారానే హాస్పిటల్స్ కు పంపి నిర్ధారణ చేసుకుంటారు. అన్ని వివరాలు సరిగ్గా ఉంటే సదరు అప్లికేషన్లను ఆమోదించి చెక్కును రెడీ చేస్తారు. ఆ చెక్కుపై దరఖాస్తుదారుడి అకౌంట్ నంబరును ముద్రించడం వల్ల పక్కదారి పట్టే అవకాశం ఉండదు. తర్వాత ఆ చెక్కుల్ని ప్రజాప్రతినిధులు లబ్ధిదారులకు అందిస్తారు.