వంతెన(Bridge)లు కూలిన ఘటనలు ఈ మధ్య బిహార్(Bihar)లో సంచలనంగా మారాయి. 15 రోజుల్లో 10 బ్రిడ్జిలు కూలిపోవడం నితీశ్ కుమార్ సర్కారు మచ్చ తెచ్చింది. దీంతో 11 మంది ఇంజినీర్లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. నదిలో పిల్లర్లు, నదిపై కల్వర్టుల నిర్మాణంలో పూర్తి నిర్లక్ష్యానికి తోడు ముందస్తు చర్యలు తీసుకోలేదని తేలడంతో ఇంజినీర్లపై వేటు వేశారు.
స్వల్ప వ్యవధిలో…
15 రోజుల వ్యవధిలోనే బిహార్లోని 6 జిల్లాలు సివాన్, శరణ్, మధుబని, అరేరియా, ఈస్ట్ చంపారన్, కిషన్ గంజ్ లో 10 బ్రిడ్జిలు నేలమట్టామయ్యాయి. తొలుత జూన్ 18న అరారియా జిల్లాలోని బాక్రా నదిపై పరారియా గ్రామం వద్ద నిర్మిస్తున్న వంతెన కుప్పకూలింది. జూన్ 22న గండక్ నదిపై, అదే నెల 23న ఈస్ట్ చంపారన్ లో ప్రమాదాలు జరిగాయి.
వీటిని ప్రధాన ప్రతిపక్షమైన RJD తీవ్రంగా తప్పుబట్టింది. గతంలో నితీశ్ మంత్రివర్గంలో పనిచేసిన తేజస్వియాదవ్, ఇప్పుడు ప్రతిపక్ష నేతగా విరుచుకుపడ్డారు. దీనిపై అధికార యంత్రాంగంతో విచారణలు జరిపించిన నితీశ్.. నిర్లక్ష్యం చూపిన ఇంజినీర్లను సస్పెండ్ చేశారు.