యాదాద్రి శ్రీలక్షీనరసింహస్వామి ఆలయం భక్తుల రద్దీతో కిక్కిరిసింది. స్వయంభువుడికి ఆర్జిత పూజలతోపాటు క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామికి సహస్ర నామార్చనల పర్వాలు విశేషంగా చేపట్టారు. వేకువజామునే గర్భాలయంలో మూలవర్లను మేల్కొలిపి ఆస్థానపరంగా బిందెతీర్థం, బాలభోగం, నిజాభిషేకం నిర్వహించి తులసీపత్రాలతో అర్చన చేశారు. వేద, మంత్ర పఠనాలతో యజ్ఞమూర్తులకు అష్టోత్తరం, సువర్ణ పుష్పార్చన కైంకర్యాలు జరిగాయి. ఆర్జిత పూజగా నారసింహ హోమం నిర్వహించిన అనంతరం భక్తుల్ని గర్భాలయంలోకి అనుమతించారు.
వరుస సెలవు రోజులకు తోడు ఆదివారం కూడా కావడంతో యాదాద్రి క్షేత్రం సందడిగా మారింది. వేల సంఖ్యలో భక్తులు స్వామి అమ్మవార్ల దర్శనానికి బారులు తీరారు. జనం తాకిడితో ఉచిత దర్శనానికి ఇంచుమించు రెండు నుంచి మూడు గంటల సమయం పడుతున్నది. అటు ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సైతం గంటన్నరకు పైగా టైమ్ పడుతోంది. లడ్డూ ప్రసాదం కౌంటర్లు, నిత్య కళ్యాణం, కొండ దిగువన గల కళ్యాణ కట్ట, పుష్కరిణి, వాహనాల పార్కింగ్ వద్ద కోలాహలం కనిపిస్తోంది.