వివాదాలు, ఆరోపణలకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిన ‘నీట్ యూజీ-2024’ విషయంలో ఏకంగా కౌన్సెలింగ్ ను వాయిదా వేయాల్సి వచ్చింది. మే 5న దేశవ్యాప్తంగా పరీక్ష నిర్వహించగా ఇవాళ్టి నుంచి కౌన్సెలింగ్ జరగాల్సి ఉంది. ‘నీట్’ నిర్వహణ తీరుపై ఎల్లుండి(జులై 08) సుప్రీంకోర్టులో విచారణ జరగాల్సి ఉన్న పరిస్థితుల్లో కౌన్సెలింగ్ వాయిదా వేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
తదుపరి ప్రకటన వచ్చే వరకు ఈ ప్రక్రియ నిలిచిపోతుంది. పరీక్ష నిర్వహించిన సంస్థ అయిన NTA(నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ) డైరెక్టర్ పై వేటు పడింది. దేశంలో పరీక్షల తీరుపై సందేహాలు నెలకొన్న వేళ ‘నీట్’ కేసును CBIకి అప్పగించడంతోపాటు పారదర్శక పరీక్షల కోసం ఇస్రో మాజీ ఛైర్మన్ రాధాకృష్ణన్ ఆధ్వర్యంలో అత్యున్నత స్థాయి(High Level) కమిటీని కేంద్రం నియమించింది.
కౌన్సెలింగ్ వాయిదా ప్రసక్తే లేదంటూ మొదట్నుంచీ చెబుతూ వస్తున్న సర్కారు నిర్ణయాన్ని పరిగణలోకి తీసుకుంటూ సుప్రీంకోర్టు సైతం ‘నీట్’ కౌన్సెలింగ్ పై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇక కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతుందని అనుకుంటున్న తరుణంలో దాన్ని వాయిదా వేస్తూ ఆకస్మిక నిర్ణయం వెలువడింది.