సాధారణంగా ఏ హిందూ ఆలయం(Temple)లోనైనా ఊరేగింపు జరిపేందుకు ఉత్సవ విగ్రహాలను బయటకు తీసుకువస్తారు. అనంతరం మూలవిరాట్ల దర్శనం కోసం భక్తుల్ని అనుమతించడం ఆనవాయితీగా ఉంటుంది. కానీ ఒడిశా పూరీ ఆలయంలో మాత్రం అందుకు భిన్నమైన, వినూత్నమైన సంప్రదాయం(Tradition) కనిపిస్తుంది. ఆ భగవంతుడే ఏడాదికోసారి గుడి నుంచి బయటకు వచ్చి భక్తులను తన్మయత్వానికి గురిచేస్తాడు.
అందుకే ఆ స్థాయిలో…
మూలవిరాట్ విగ్రహాలే రథయాత్రలో పాల్గొనేందుకు గుడి నుంచి బయటకు రావడంతోనే జగన్నాథుడి క్షేత్రం విఖ్యాతి పొందింది. పురాణాలలో పురుషోత్తమ క్షేత్రంగా వ్యవహరించే ‘పూరీ ఆలయం’ ఎన్నో విశిష్టతలకు నిలయం. ఇక్కడ ప్రతి సంవత్సరం కర్ర(దారువు)తో రథాలు ప్రత్యేకంగా తయారు చేస్తారు. 44 అడుగులతో మొదలయ్యే జగన్నాథుడి రథం కన్నా ఒక్కో అడుగు తగ్గుతూ బలభద్ర, సుభద్ర రథాలు ఉంటాయి.
సుదర్శనుడు…
జగన్నాథుడి వెంటే సుదర్శనుడు ఉంటూ ఆలయంలోపల, రథయాత్రలోనూ కనిపిస్తాడు. ఈ నాలుగు మూర్తులు రుగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేదాలుగా భావిస్తారు. ప్రపంచంలోనే ఒక రథయాత్రకు లక్షల సంఖ్యలో హాజరయ్యే వేడుకగా పూరీ క్షేత్రం విరాజిల్లుతుంది. ఏటా ఆషాఢ శుద్ధ విదియనాడు ఆలయం నుంచి యజ్ఞ మండపాని(గుండిచా)కి వచ్చి 10 రోజులు భక్తుల చెంతన ఉండే మూలవిరాట్లు తిరిగి ఆలయంలోకి ప్రవేశించడం క్షేత్ర సంప్రదాయం.