
నాలుగు రోజులుగా టెన్షన్ నడుమ కొనసాగుతున్న యాషెస్ సిరీస్ థర్డ్ టెస్టులో ఇంగ్లాండ్ విజయం సాధించింది. ఆస్ట్రేలియా విధించిన 251 పరుగుల లక్ష్యాన్ని 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 254 పరుగులు చేసి 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. వరుణుడి ప్రభావంతో మూడో రోజు సగం ఆటను కోల్పోయినా… రెండో ఇన్నింగ్స్ లో కంగారూలను తక్కువ స్కోరుకే ఆలౌట్ చేసి పట్టు బిగించింది. వికెట్ నష్టపోకుండా 27 పరుగులతో నాలుగో రోజు బ్యాటింగ్ కంటిన్యూ చేసిన స్టోక్స్ సేన… ఎట్టకేలకు విజయం సాధించింది. ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయినా హ్యారీ బ్రూక్, క్రిస్ వోక్ పోరాటంతో సిరీస్ లో పోటీలో నిలిచింది. ఓపెనర్ డకెట్(23), మొయిన్ అలీ(5) త్వరగానే ఔటయ్యారు. వీరిద్దరినీ మిచెల్ స్టార్క్ బుట్టలో వేసుకున్నాడు. ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ లో 5 వికెట్లు తీసుకుని హడలెత్తించాడు.
ఒక ఎండ్ నుంచి స్టార్క్ వికెట్లు తీసుకుంటున్నా మరోవైపు పార్ట్ నర్ షిప్స్ నమోదు చేస్తూ ఇంగ్లాండ్ బ్యాటర్లు జట్టును గట్టెకించారు. ఓపెనర్ క్రాలీ(44) పోరాటం చేయగా, రూట్(21) మరోసారి తక్కువ స్కోరుకే ఔటయ్యాడు. కానీ యువ సంచలనం హ్యారీ బ్రూక్(75; 93 బంతుల్లో 9×4) ఎలాంటి తడబాటు లేకుండా బ్యాటింగ్ కొనసాగించాడు. మిగతా మెయిన్ బ్యాటర్లు కెప్టెన్ స్టోక్స్(13), బెయిర్ స్టో(5) వరుసగా పెవిలియన్ కు క్యూ కట్టారు. వోక్స్(32; 47 బంతుల్లో 4×4) అండతో బ్రూక్.. లక్ష్యానికి దగ్గరగా చేర్చాడు. కానీ మరో 21 పరుగులు చేయాల్సిన దశలో బ్రూక్స్ ఔటయ్యాడు. కానీ వోక్స్ పట్టుదలగా నిలిచి మార్క్ వుడ్(15; 7 బంతుల్లో 1×4, 1×6) అండతో ఇంగ్లాండ్ ను విన్నర్ గా నిలిపాడు. ‘తొలి ఇన్నింగ్స్ లో (5/34) సహా మ్యాచ్ లో మొత్తం 7 వికెట్లు తీసిన ఇంగ్లాండ్ బౌలర్ మార్క్ వుడ్ కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కింది. 5 మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో ఆసీస్ 2-1 లీడ్ తో ఉంది.