రాష్ట్రంలో సమగ్ర కులగణన(Caste Census) చేపట్టాలంటూ యాత్ర మొదలుపెడుతున్నట్లు BC సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈనెల 14 నుంచి 31 వరకు 17 రోజుల పాటు 10 జిల్లాల్లో సమగ్ర కుల గణన సాధన యాత్ర ఉంటుందన్నారు. కామారెడ్డి నుంచి కరీంనగర్ వరకు జరిగే యాత్ర ద్వారా సర్కారుపై ఒత్తిడి పెంచుతామంటూ కుల సంఘాలతో సమావేశం నిర్వహించారు.
మాట మరవొద్దు…
అధికారంలోకి వస్తే 6 నెలల్లో కులగణన చేపట్టి స్థానిక సంస్థల(Local Bodies) ఎన్నికల్లో 42 శాతానికి రిజర్వేషన్లు పెంచుతామన్న మాటను కాంగ్రెస్ నిలబెట్టుకోవాలన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కామారెడ్డిలోనే BC డిక్లరేషన్ను కాంగ్రెస్ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేసిన BC సంఘం నేతలు.. అందుకు బదులుగా కామారెడ్డి నుంచే తమ యాత్ర స్టార్ట్ చేస్తున్నామన్నారు.
చైతన్యమే ధ్యేయంగా…
ఈ యాత్రలో సభలు, సమావేశాలతోపాటు 31 నాడు కరీంనగర్లో ముగింపు సభ నిర్వహించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎవరికి వారు స్వచ్ఛందంగా తమ కులాల పేర్లు చెప్పేందుకు ఈ యాత్ర ద్వారా చైతన్యం తెస్తామన్నారు. BC కుల సంఘాల JAC ఛైర్మన్ కుందారం గణేశ్ చారి, కన్వీనర్ బాలగోని బాలరాజ్ గౌడ్ తోపాటు తాటికొండ విక్రమ్ గౌడ్, సింగం నగేశ్ గౌడ్, ఎలికట్టె విజయ్ కుమార్ గౌడ్, గూడూరు భాస్కర్, సమతా యాదవ్, సంధ్య, శ్యామల, రేణుక, జయశ్రీ తదితరులు సమావేశానికి హాజరయ్యారు.