
పనితీరు ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికల్లో గెలవడం మాత్రం అంత ఈజీ కాదని BJP ప్రెసిడెంట్ JP నడ్డా హెచ్చరించారు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ జరిగితే గెలవగలమా అని ప్రశ్నించారు. నడ్డా ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని పార్టీ స్టేట్ ఆఫీస్ లో జరిగిన సమావేశానికి 11 రాష్ట్రాల అధ్యక్షులు అటెండ్ అయ్యారు. పలు రాష్ట్రాల ప్రెసిడెంట్ల పనితీరుపై అసంతృప్తితోపాటు ఆగ్రహం కూడా వ్యక్తం చేసినట్లు తెలిసింది. బాగా పనిచేసే అధ్యక్షుల్లో ఒకరిద్దరు పేర్లను ప్రస్తావిస్తూ వారిని ప్రశంసిస్తూనే మిగతా వారంతా అలాంటి లీడర్లను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు.
ఈ సమావేశంలో ప్రధానంగా తాజా రాజకీయ పరిస్థితులపై కీలక చర్చ జరిగింది. రాబోయే ఎన్నికలు, విజయం కోసం పార్టీని బలోపేతం చేయడం వంటి అంశాలను ప్రస్తావించారు. ప్రధాని నరేంద్ర మోదీ 9 సంవత్సరాల్లో చేపట్టిన అభివృద్ధిని గ్రౌండ్ లెవెల్ వరకు తీసుకెళ్లాలని సూచించారు. ‘అపోజిషన్ లో ఉన్న రాష్ట్రాల్లో మనం అధికారంలోకి రావాలంటే ఏం చేయాలో ముందుగా పరిస్థితులపై అధ్యయనం చేయండి… కష్టపడ్డవాళ్లకు హైకమాండ్ ఎప్పుడూ అండగా ఉంటుంది’ అని భరోసానిచ్చారు.
ఈ సమావేశం ముగిశాక శంషాబాద్ నోవాటెల్ హోటల్లో నడ్డాను రాష్ట్ర నేతలు కలిశారు. ఎలక్షన్ మేనేజ్ మెంట్ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ తోపాటు వివేక్ వెంకటస్వామి, విజయశాంతి, MP ధర్మపురి అర్వింద్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ ప్రెసిడెంట్ తో సమావేశమయ్యారు.