గులాబీ పార్టీ(BRS) బలం శాసనసభలో రానురానూ తగ్గిపోతున్నది. కారు గుర్తు కలిగిన మొత్తం 38 సభ్యుల్లో ఎనిమిది మంది గడప దాటి వెళ్లిపోయారు. తాజాగా రాజేంద్రనగర్ MLA ప్రకాశ్ గౌడ్ చేరికతో కాంగ్రెస్ బలం పుంజుకుంటే… BRS మాత్రం ఒక్కొక్కర్నే చేజార్చుకుంటున్నది.
రాజధాని చుట్టూ…
ఇప్పటివరకు పార్టీ విడిచిపెట్టిన వారిలో 8 మంది ఉంటే అందులో హైదరాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతాల వారు ముగ్గురున్నారు. దానం(ఖైరతాబాద్), కాలే యాదయ్య(చేవెళ్ల), ప్రకాశ్ గౌడ్(రాజేంద్రనగర్) కాగా… మిగతా ఐదుగురు స్టేషన్ ఘన్పూర్, భద్రాచలం, బాన్సువాడ, జగిత్యాల, గద్వాల MLAలు.
మొన్నటి ఎన్నికల్లో మిగతా జిల్లాల కంటే రాజధాని పరిసర ప్రాంతాల్లోనే BRS నుంచి ఎక్కువ మంది MLAలు గెలిచారు. ఇప్పుడలాంటి వారందరిపైనా హస్తం పార్టీ ఫోకస్ పెట్టినట్లు ప్రచారం ఉంది. కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు మరింత మంది రెడీగా ఉన్నారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి.
ఏమైతది…
మూడింట రెండొంతుల మంది వెళ్లిపోతే ఏకంగా సభాపక్షమే రద్దయ్యే ప్రమాదముంది. 38 మందిలో 25 మంది చేజారితే గులాబీ పార్టీకి ఇబ్బందే. శాసనసభ, మండలిలోనూ ఆ పార్టీ విపత్కర పరిస్థితుల్లో ఉంది. మండలిలో మొత్తం 40కి గాను BRSకు 29 మంది ఉంటే 8 మంది కాంగ్రెస్ లో చేరారు.
29లో నలుగురు నామినేటెడ్లను మినహాయించి మిగతా 25 మందిలో 17 మంది పార్టీ మారితే మండలి పక్షానికే ఎసరొస్తుంది. మరింతమందిని ఆకర్షించేందుకు అధికార పార్టీ.. ఉన్నవారినెలా కాపాడుకోవాలన్న ఆలోచనలో గులాబీ పెద్దలున్నారు.