జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచడం, కుల గణనకు కట్టుబడి ఉండటం వంటి హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పెద్దలు… రాబోయే స్థానిక సంస్థల(Local Bodies) ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలన్న దానిపై చర్చించారు. BC రిజర్వేషన్ల పెంపు ఎలా ఉండాలన్న అంశంపై పంచాయతీరాజ్ శాఖ సమీక్ష(Review)లో ప్రధాన చర్చ సాగించారు.
త్వరలోనే ఎన్నికలని…
స్థానిక సంస్థలకు త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తామని ఇప్పటికే CM చెప్పిన దృష్ట్యా.. రిజర్వేషన్ల అమలు, పెంపు దిశగా సర్కారు చర్యలు ప్రారంభించింది. మంత్రులు దామోదర, పొన్నం, సీతక్క, సురేఖ, సీనియర్ నేత జానారెడ్డి సహా పలువురు ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రణాళికబద్ధంగా ముందుకెళ్లేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఇప్పటికే కులగణనకు ఆమోదం తెలిపినందున ఆ విధంగానే ఎన్నికలు వెళ్తే ఎలా ఉంటుంది.. అందకు ఎంత టైమ్ పట్టొచ్చు అని అధికారుల్ని CM అడిగారు. గత పంచాయతీ ఎన్నికల్లో అనుసరించిన విధానాలు వచ్చే ఎన్నికల సన్నద్ధతపై నివేదిక అందజేయాలని CM స్పష్టం చేశారు. శాసనసభ(Assembly) సమావేశాలు(Sessions) మొదలయ్యేలోపు మరోసారి భేటీ అవ్వాలని నిర్ణయించారు.
ఐదున్నర నెలలు…
కర్ణాటకలో 2015లో, బిహార్లో 2023లో కులగణన చేసినా వాటి పూర్తి సమాచారాన్ని వెల్లడించలేదని, 2011లో కేంద్రం తెచ్చిన కుల గణన ఫార్మాట్ 53 కాలమ్స్(Columns)లో ఉందని, దానికి మరో మూడు అంశాలు జోడించి కులగణన చేపడితే ఐదున్నర నెలలు పడుతుందని అధికారులు వివరించారు.
ఉమ్మడి రాష్ట్రంలో, వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో విధానాలు.. సుప్రీంకోర్టులో వేసిన కేసులు, వాటి తీర్పులను జానారెడ్డి ప్రస్తావిస్తే.. వాటి తీరుపై క్రమ పట్టిక తయారు చేసి, చట్టపర విషయాల్లో అడ్వకేట్ జనరల్(AG)తో చర్చించాలని CM ఆదేశించారు.