అధికార పార్టీ భారత్ రాష్ట్ర సమితి(BRS)కు హైదరాబాద్ మహానగరంలో ల్యాండ్ కేటాయించడంపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో ప్రజాప్రయోజన వ్యాజ్యం(PIL) దాఖలైంది. అత్యంత విలువైన ఏరియాలో 11 ఎకరాలు కేటాయించడాన్ని తప్పుపడుతూ హైకోర్టులో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ పిల్ వేసింది. ఐటీకి ఆయువుపట్టు ప్రాంతంగా భావించే కోకాపేటలో ఖరీదైన భూమిని BRSకు కేటాయించడాన్ని సవాల్ చేసింది. ఆఫీసుకు అంత పెద్దమొత్తం విలువ చేసే ల్యాండ్ ను అత్యంత తక్కువ రేట్ కు కట్టబెట్టారంటూ కోర్టును ఆశ్రయించింది.
అక్కడ ఎకరం రూ.50 కోట్లకు పైమాటే…
కోకాపేటలో ప్రస్తుతం ఎకరం భూమి దొరకాలంటే ఎంతో కష్టమైన పనే. అలాంటి చోట రూ.50 కోట్లకు పైగా విలువచేసే ఎకరం భూమిని BRSకు కేవలం రూ.3.41 కోట్లకే ఎలా ఇస్తారంటూ పిటిషన్ లో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రస్తావించింది. ఐదు రోజుల్లోనే ఈ తతంగం పూర్తి చేసి ల్యాండ్ అప్పగించడం సమంజసం కాదని, భూమి కేటాయింపునకు సంబంధించిన డాక్యుమెంట్లను సీక్రెట్ గా ఉంచారని కోర్టుకు తెలియజేసింది. ట్రెయినింగ్, ఎక్సలెన్స్ సెంటర్ పేరిట BRS ల్యాండ్ తీసుకుందని, ఆ పార్టీకి ఇప్పటికే ఆఫీసు ఉండగా మళ్లీ ఇవ్వడమేంటంటూ పిటిషన్ లో పేర్కొంది. భూ కేటాయింపునకు సంబంధించిన జీవోను రద్దు చేయాలని, కోకాపేటలో కన్ స్ట్రక్షన్ వర్క్క్ జరగకుండా స్టే ఇవ్వాలని హైకోర్టును పిటిషనర్ కోరారు.