అసలే భీకర అడవి(Deep Forest). భారీ వర్షాలకు విధ్వంసం జరిగి 344 మంది ప్రాణాలు కోల్పోయిన కేరళలోని వయనాడ్(Wayanad)లో.. రెస్క్యూ బృందాలు మరో సాహసాన్ని చేపట్టాయి. అత్యంత ప్రమాదకర రీతిలో గుహలో చిక్కుకున్న నలుగురు చిన్నారుల్ని భద్రతా బలగాలు రక్షించాయి.
ఈ పిల్లలకు ఆహారం తెచ్చేందుకు వారి మాతృమూర్తి 5 రోజుల క్రితం దట్టమైన అట్టామల(Attamala) అడవులకు వెళ్లింది. ఇదే సమయంలో భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడటంతో తల్లి, పిల్లలు వేరయ్యారు. ప్రజల్ని రక్షించేందుకు వెళ్లిన బలగాలు దట్టమైన ప్రాంతంలోనూ జల్లెడ పట్టాయి.
అలా సంచరిస్తున్న టైంలో ఆ పిల్లల తల్లిని కలపేట రేంజ్ ఫారెస్ట్ వద్ద అటవీ అధికారులు గుర్తించారు. ఫారెస్ట్ సిబ్బందితోపాటు భద్రతా బలగాలు ఆ తల్లితోపాటు గుహ వద్దకు చేరుకున్నాయి. అందులో తలదాచుకున్న నలుగురు గిరిజన పసిబిడ్డల్ని బయటకు తీసుకువచ్చాయి.
రెస్క్యూ టీముల్లోని సభ్యులు చిన్నారుల్ని నడుముకు కట్టుకుని గుహ నుంచి డీప్ ఫారెస్టులో కొండ, కోనలు.. జలపాతాలు, బండరాళ్లు దాటుకుంటూ మైదాన ప్రాంతానికి చేరుకున్న దృశ్యాలు గుండెల్ని మెలి పెట్టించాయి. వయనాడ్ విధ్వంసం తర్వాత వారం రోజులకు ఎలాంటి ఆశలు లేని పరిస్థితుల్లో ఒక కుటుంబాన్ని రక్షించడం భద్రతా బలగాల సాహసానికి నిదర్శనంగా నిలిచాయి.