ఉద్యోగాల్లో ప్రత్యేక కోటాను నిరసిస్తూ బంగ్లాదేశ్ లో జరుగుతున్న ఘర్షణలు ప్రధాని పదవికే ఎసరు తెచ్చాయి. అధికార పార్టీ-ఆందోళనకారుల దాడుల్లో ఇప్పటికే 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ప్రధాని షేక్ హసీనా ప్యాలెస్(Palace)ను పెద్దసంఖ్యలో నిరసనకారులు ముట్టడించారు.
దీంతో ఆమె.. ఢాకాలోని అధికారిక నివాసమైన గానబభాన్ ప్యాలెస్ ను వీడి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆమె తన సోదరి షేక్ రెహానాతో కలిసి ప్రత్యేక హెలికాప్టర్లో భారత్ లోని బెంగాల్ చేరుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఆమె రాజీనామా కూడా చేసినట్లు తెలుస్తున్నది.
ఢాకాను సైన్యం అదుపులోకి తీసుకోగా.. ఎక్కడ చూసినా తుపాకుల చప్పుళ్లు వినిపిస్తున్నాయి. రాజధాని వీధుల్లో 4 లక్షల మంది ఆందోళనకారులు సంచరిస్తుండగా.. ఈ రోజు 98 మంది చనిపోయినట్లు ఆర్మీ చీఫ్ వకర్-ఉజ్-జమాన్ తెలిపారు.