వక్ఫ్ బోర్డులకు ఉన్న అపరిమిత అధికారాలను నియంత్రించేందుకు త్వరలోనే బిల్లు రానుందా… అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. ఏదైనా ఆస్తిని వక్ఫ్ కు చెందినదిగా ప్రకటించి దాన్ని నియంత్రించడానికి గాను బోర్డులకు గల అధికారాలపై కేంద్ర సర్కారు దృష్టిసారించినట్లే కనపడుతున్నది.
2013కు ముందున్న వక్ఫ్ చట్టంలోని 40 నిబంధనలకు సవరణలు చేయాలన్న ఆలోచనపై మంత్రివర్గం శుక్రవారం చర్చించినట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. వక్ఫ్ బోర్డు అధికార పరిధిని తనిఖీ చేయడం, దేశవ్యాప్తంగా లక్షల కోట్ల ఆస్తుల్ని బోర్డులు నియంత్రిస్తున్న వైనంపై ప్రధాన చర్చకు వచ్చినట్లు వార్తలు వచ్చాయి.
వక్ఫ్ చట్టం 1954 నుంచి అమలవుతుండగా.. 1995లో తొలిసారిగా సవరణలు చేశారు. కేబినెట్ నిర్ణయాల గురించి వివరాలు పెద్దగా బయటకు రాకున్నా వక్ఫ్(Waqf) చట్టాన్ని సవరించే బిల్లును వచ్చే వారం పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశాలు కనపడుతున్నాయి.
ప్రతిపాదిత సవరణల ప్రకారం.. గతంలో, ఇపుడున్న అపరిమితమైన వక్ఫ్ బోర్డుల అధికారాలు, క్లెయిమ్ లు తప్పనిసరిగా పరిశీలనకు లోబడి ఉంటాయి. వక్ఫ్ బోర్డులతోపాటు వ్యక్తిగత యజమానుల పరిధిలోని ఆస్తులకు కూడా ఇదే విధానాన్ని అమలు చేయబోతున్నట్లు ప్రచారం సాగుతున్నది.