తీవ్రమైన మధుమేహ వ్యాధితో బాధపడుతున్న వారికి త్వరలోనే కొత్త వైద్యం అందుబాటులోకి వచ్చే అవకాశముంది. టైప్-1 డయాబెటిస్ పై సాగించిన పరిశోధనలు ఫలవంతం(Success) అయ్యాయి. మొత్తం 12 మందిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తే అందరిలోనూ పాజిటివ్ రిజల్ట్స్ కనిపించాయి.
ఎలా చేశారంటే…
వ్యాధిని నయం చేసే కణాల(Cells)ను భర్తీ చేయడం ద్వారా మధుమేహ మూల కారణానికి ట్రీట్మెంట్ చేసే ప్రయోగానికి ముందడుగు పడింది. లండన్ కు చెందిన 35 ఏళ్ల నర్సు అమండా స్మిత్.. టైప్-1 డయాబెటిస్ తో బాధపడుతున్నారు. 2023లో వాలెంటైన్స్ డే సందర్భంగా ఆమెపై క్లినికల్ ట్రయల్స్ చేశారు. పిండ మూలకణాలతో ల్యాబ్ లో అభివృద్ధి చేసిన ఐలెట్ కణాలను స్మిత్ కాలేయ రక్తనాళంలోకి ప్రవేశపెట్టారు.
పనితీరుపై…
ఐలెట్(Islet) కణాలను స్వీకరించిన వారిలో స్మిత్ తోపాటు మరో 11 మంది ఉన్నారు. జూన్లో జరిగిన అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ సదస్సులో సమర్పించిన డేటా ప్రకారం.. క్లినికల్ ట్రయల్స్ లోని 12 మంది రోగులు 2024 ఆగస్టు నాటికి ఇన్సులిన్ తీసుకోవడం ఆగిపోయింది. అంటే కొత్త కణాలు బాగా పనిచేస్తున్నాయని నిర్ధారణైంది. అయితే వెర్టెక్స్ ఫార్మాస్యూటికల్స్ డెవలప్ చేసిన ఈ చికిత్స(Therapy) ఇంకా ప్రయోగదశలోనే ఉన్నట్లు వైద్య నిపుణుడు కరోలిన్ వై.జాన్సన్ అంటున్నారు.
ఆ తర్వాత…
అయితే సైంటిస్టులు అభివృద్ధి చేసిన కణాలు ఎంతకాలం పనిచేస్తాయనేది ఇప్పుడే చెప్పలేకపోతున్నారు. మరింతమందిపై ట్రయల్స్ నిర్వహిస్తే గానీ కొత్త కణాల పనితీరుపై ఒక అంచనాకు రాలేమంటున్నారు. అయితే టైప్-1 డయాబెటిస్ బాధితులకు మాత్రం ఈ ప్రయోగం ఒక వరంగా నిలిచిపోయే అవకాశముందని సైంటిస్టులు చెబుతున్నారు.