మంత్రి మల్లారెడ్డికి మరో షాక్ తగిలింది. వరుసగా రెండో రోజూ ఆయనకు నిరసనల సెగ తాకింది. సొంత నియోజకవర్గమైన మేడ్చల్ జిల్లాలో పర్యటిస్తున్న మల్లారెడ్డిని… ఆయా గ్రామాల్లోని ప్రజలు నిలదీస్తున్నారు. చింతలపల్లి మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు వచ్చిన ఆయన్ను తుషారుపల్లి గ్రామస్థులు అడ్డుకున్నారు. రోడ్లు, డ్రైనేజీ అధ్వానంగా ఉన్నాయంటూ ఆయనపై మండిపడ్డారు. ఎన్నికల సమయంలో మినహా మిగతా టైమ్ లో తమ ఊళ్లు గుర్తుకు రావంటూ నిలదీశారు. మినిమమ్ సౌకర్యాలు లేకపోతే ఎలా బతికేది అంటూ గట్టిగా ప్రశ్నించారు.
సోమవారం నాడు ఘట్ కేసర్ మండలం కాచవానిసింగారంలోనూ స్థానికుల నుంచి మల్లారెడ్డి విపత్కర పరిస్థితిని ఎదుర్కొన్నారు. గ్రామంలో సమస్యల గురించి ఎవరూ పట్టించుకోవట్లేదని… పంచాయతీ ల్యాండ్ లో BC బిల్డింగ్ నిర్మించాలని డిమాండ్ చేశారు. సమస్యలు చెబుతుండగా గ్రామస్థులను అక్కణ్నుంచి పంపించివేసేందుకు పోలీసులు ప్రయత్నించడంతో… పోలీసులు, మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విలేజర్స్ ఆందోళనతో మల్లారెడ్డి తిరుగుముఖం పట్టాల్సి వచ్చింది.