వెస్ట్ బెంగాల్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ సత్తా చాటింది. 30 వేల స్థానాలు గెలుపొంది మరో 1,500 చోట్ల లీడ్ లో ఉంది. ఇక BJP 7,800 చోట్ల విజయం సాధిస్తే ఇంకో 400 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మంగళవారం ఉదయం ఎనిమిదిన్నర గంటలకు ఓట్ల లెక్కింపు మొదలైంది. పోలింగ్, రీపోలింగ్ తరహాలోనే కౌంటింగ్ సమయంలోనూ పలు చోట్ల ఘర్షణలు జరిగాయి. కొన్ని చోట్ల పోలీసులు లాఠీఛార్జి చేసి స్థానికుల్ని చెదరగొట్టారు.
రాష్ట్రవ్యాప్తంగా 70 వేలకు పైగా పంచాయతీలకు గత శనివారం పోలింగ్ జరిగింది. ఘర్షణలు, కాల్పులతో దద్దరిల్లిన పోలింగ్ వల్ల 15 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా చోట్ల బ్యాలెట్ బాక్సులను ధ్వంసం చేయడంతో మొత్తం 19 జిల్లాల్లో 696 చోట్ల రీపోలింగ్ నిర్వహించారు. తృణమూల్ కాంగ్రెస్, కమలం పార్టీ వర్గాలు పరస్పరం దాడులకు పాల్పడటంతో బెంగాల్ మొత్తం రణరంగంగా మారిపోయింది. 2018లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో TMC 34 శాతం సీట్లను ఏకగ్రీవం చేసుకుంది.