ఓటుకు నోటు కేసులో విచారణ(Hearing)కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కావాల్సిందేనని నాంపల్లి కోర్టు ఆదేశించింది. ఆయనతోపాటు నిందితులు అటెండ్ కాకపోవడంపై ఆగ్రహం(Fire) వ్యక్తం చేసింది. రేవంత్, వేం నరేందర్ రెడ్డి, ఉదయ్ సింహ, సండ్ర వెంకటవీరయ్య, సెబాస్టియన్ తరఫున ప్రతిసారీ కేవలం వారి తరఫు అడ్వకేట్లే వస్తుండగా దీనిపై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు.
ఈరోజు ట్రయల్ ప్రారంభించేందుకు గాను నిందితులంతా ప్రత్యక్షంగా హాజరుకావాల్సి ఉంది. జెరూసలెం మత్తయ్య, అడ్వకేట్ కొప్పనేని సాయిమోహన్ కృష్ణ సహా నలుగురు మాత్రమే వచ్చారు. ఈ సందర్భంగా రేవంత్ తరఫు న్యాయవాదులను తీవ్రంగా మందలించిన న్యాయమూర్తి… అక్టోబరు 16న నిందితులంతా హాజరు కావాల్సిందేనని ఆదేశిస్తూ, అలా జరగకపోతే వారెంట్ జారీ చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు.